Leading News Portal in Telugu

మామిడి ఎగుమతుల జోరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతులు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటి వరకు సమారు 42 టన్నుల మామిడి కాయలు ఎగుమతి చేసినట్టు రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి చెప్పారు. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. సీజన్‌ ముగిసేసరికి గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా రెండు రాష్ట్రాల నుంచి 3,000 టన్నుల వరకు మామిడి పళ్లు ఎగుమతయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని అపెడా ప్రాంతీయ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ టి సుధాకర్‌ చెప్పారు. ఈ సంవత్సరం చైనా మార్కెట్‌ నుంచి భారత మామిడి కోసం విచారణలు వచ్చాయి. చైనాలోని కొన్ని కంపెనీలు ఇందుకోసం తెలంగాణలోని కొంత మంది ఎగుమతిదారులను సంప్రదించాయి. అయితే సరైన హాట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సౌకర్యం లేకపోవడంతో తెలంగాణ నుంచి చైనాకు మామిడి ఎగుమతులు సాధ్యం కావడం లేదు. దీంతో వచ్చే సంవత్సరానికి స్వయంగా ఈ సౌకర్యం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు అపెడా వర్గాలు చెప్పాయి.

తగ్గిన దిగుబడి
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో మామిడి దిగుబడులు 30 నుంచి 40 శాతం పడిపోయాయుయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడవడంతో ఎగుమతి మార్కెట్లకు అవసరమైన నాణ్యమైన మామిడి లభ్యత ఈ ఏడాది బాగా తగ్గింది. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వ్యాధులతో ఈ సంవత్సరం కాయల నాణ్యత బాగా దెబ్బతింది. దీంతో విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్న నాణ్యమైన బంగినపల్లి రకం మామిడి లభ్యత తగ్గింది’ అని అని సుధాకర్‌ తెలిపారు.

ఇతర రకాలకూ గిరాకీ
గతంలో రెండు రాష్ట్రాల నుంచి బంగినపల్లి, అల్ఫోన్సా రకాలే ఎక్కువగా ఎగుమతయ్యేవి. ఈ సంవత్సరం తొణుకులు, సువర్ణరేఖ రకాలకు డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే సువర్ణ రకం మామిడి పండ్లకు దక్షిణ కొరియా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడిందని స్నేహా ఆగ్రో ఎండి ఎంవి రాజు చెప్పారు. ఈ రకానికి వ్యాపారులు రైతులకు టన్నుకు రూ.20,000 వరకు చెల్లిస్తున్నారు. ఎగుమతి మార్కెట్‌లో మాత్రం టన్ను సువర్ణ రేఖ మామిడికి రూ.70,000 వరకు లభిస్తున్నట్టు సమాచారం. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి సువర్ణ రేఖ మామిడి ఎక్కువగా దక్షిణ కొరియాకు ఎగుమతవుతోంది. తెలంగాణలో సాగు చేసే తణుకులు రకం మామిడి పండ్లకీ ఈ ఏడాది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి డిమాండ్‌ ఏర్పడిందని తెలంగాణ ఉద్యానశాఖ అధికారులు చెప్పారు.

చుక్కలంటిన బంగినపల్లి ధర
దిగుబడులు తగ్గడం, నాణ్యత దెబ్బతినడంతో ఎగుమతులకు అవసరమైన నాణ్యమైన బంగినపల్లి రకం మామిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ రకం టన్నుకు రూ.45,000 నుంచి రూ.50,000 పెడితేగానీ దొరకడం లేదని రాజమహేంద్రవరానికి చెందిన ఒక ప్రముఖ ఎగుమతిదారు చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో టన్ను బంగినపల్లి మామిడి రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య లభించాయి. అల్ఫోన్సా రకం మామిడి కూడా టన్ను రూ.40,000 నుంచి రూ.45,000 పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి కాపు 15-30 రోజులు ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల 15 వరకు ఎగుమతులు ఉంటాయని భావిస్తున్నారు.

విశాఖ నుంచి ఎయిర్‌ కార్గో ద్వారా..
విశాఖపట్నం నుంచి ఈ ఏడాది తొలిసారిగా ఎయిర్‌ కార్గో ద్వారా మామిడి ఎగుమతి అయింది. ఈ ఏడాది విశాఖ పట్నం విమానాశ్రయంలో అంతర్జాతీయ ఎయిర్‌కార్గో అందుబాటులోకి వచ్చింది. దీంతో మామిడి వ్యాపారులు విదేశాలకు మామిడిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసేందుకు సిద్ధమయ్యారు. విజయనగరానికి చెందిన హర్ష అనే వ్యాపారి కొద్ది రోజుల క్రితం ఎయిర్‌ ఆసియా ద్వారా మూడు టన్నుల సువర్ణ రేఖ రకం మామిడిని దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. మరో మూడు టన్నుల మామిడిని హైదరాబాద్‌ నుంచి జర్మనీకి పంపించారు.

మరికొందరు వ్యాపారులు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ద్వారా కొలంబోకు పంపించి, అక్కడి నుంచి అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ‘విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం సన్నగా (నారో) ఉండే విమానాల ద్వారానే మామిడి పండ్లు ఎగుమతి చేయాల్సి వస్తోంది. దీంతో ఒక విమానం నుంచి మరో విమానానికి మామిడి పండ్ల బాక్సులు మార్చేటపుడు సరుకు చెడిపోతోంది. వెడల్పుగా (వైడ్‌ బాడీ) విమానాల ద్వారా అయితే ఈ సమస్య ఉండదు’ అని హర్ష చెప్పారు. ఇటీవల జర్మనీకి పంపించిన మూడు టన్నుల మామిడి పండ్ల బాక్సులు ఇలానే పాడై పోయాయని తెలిపారు.