ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య
నూజివీడు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గతవారం ఆత్మహత్యకు పాల్పడిన బడుగు రైతు, తెలుగుదేశం కార్యకర్త బెజవాడ శ్రీనివాసరావు తొమ్మిది రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.. మే 23న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానం మరిచారని, రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, అందుకు అన్ని పార్టీలూ సహకరించాలని కోరుతూ రెండు పేజీల లేఖ రాసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని విలేకరులకు ఫోన్‌ద్వారా తెలియజేయగా.. వారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతన్ని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడిన శ్రీనివాసరావు గురువారం ఉదయం మృతి చెందాడు.
మృతదేహాన్ని సందర్శించిన నాయకులు
శ్రీనివాసరావు మృతిచెందిన విషయం తెలియడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ప్రత్యేకహోదా సాధనసమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి తదితరులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అతని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం లేదా పార్టీ తరఫున సాయం అందేలా కృషిచేస్తానని అర్జునుడు అతని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.