Leading News Portal in Telugu

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ డోర్‌ డెలివరీ ఉండదు..మ‌రి ఎలాగంటే

కరోనా వైరస్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. ఆద‌మ‌రిస్తే చాలు..ఈ వైర‌స్ క్ష‌ణాల్లో శ‌రీరంలోకి వెళ్లి..ఊహించ‌ని ప్ర‌మాదాన్ని తీసుకొస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా..వంట గ్యాస్‌ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ ప‌ద్ద‌తిలో మార్పు చేశాయి. గతంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక డెలివరీ బాయ్ నేరుగా ఇళ్లలోకి వచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాడు. ఇకపై అలా కుదరదు.. ఇంటి గేటు వరకే తమ డెలివరీ బాయ్ వస్తాడని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ, వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ డెలివరీ విధానంలో ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గ్యాస్‌ కంపెనీలకు ఆదేశాలు అందాయి.

కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్న క్రమంలో భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ హెడ్‌ ఆర్‌ శ్రావణ్‌ రావు మాట్లాడుతూ.. ‘ప్రజలు, గ్యాస్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూనే, స్టెరిలైజ్డ్‌ గ్లౌజులు, మాస్కులు ధరించి సిలిండర్లను డెలివరీ చేస్తాం. వాహనాల స్టెరిలైజేషన్ కోసం రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం’ అని వెల్లడించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ ఇప్పటికే ఆయిల్, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇప్ప‌డు ఇదే ప‌ద్ద‌తి ఫాలో కానుంది.