Leading News Portal in Telugu

#OilCrash : నెగెటివ్ చమురు ధరల ఫ్యూచరేంటి? ప్రజలకు కలిసొస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు… -26.24కి పడిపోవడంతో… స్టాక్ మార్కెట్లు కూడా పాతాళం వైపే చూస్తున్నాయి. దీనిపై మనం కొంత విశ్లేషించుకోవచ్చు. భారత్ దేశం… తన చమురు అవసరాల్లో ఎక్కువ శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల చమురు ధరలు ఎంత తగ్గితే అంత ఇండియాకి మంచిదే. దీని వల్ల మనం దిగుమతి చేసుకునే ముడి చమురుకి తక్కువ చెల్లించవచ్చు. అందువల్ల మన అంతర్జాతీయ వాణిజ్య లోటు తగ్గుతుంది. ఎందుకంటే మన దేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల మనం విదేశాలకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతోంది. ఇప్పుడు చమురు పతనంతో కరెంటు ఖాతా లోటు తగ్గడమే కాదు… మన రూపాయి మారకపు విలువ కూడా పెరుగుతుంది. దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది.

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా : చరిత్రలో తొలిసారిగా క్రూడాయిల్ ధరలు సోమవారం అర్థరాత్రి వేళ నెగెటివ్‌ (మైనస్)లోకి వెళ్లాయి. జనరల్‌గా చమురు ధరలు తగ్గితే… ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ… మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… ఇలా తగ్గించేందుకు సిద్ధంగా లేవు. కనీసం ఇలాంటప్పుడైనా ధరలు తగ్గించకపోవడం అన్యాయం అని ప్రతిపక్ష కాంగ్రెస్ భగ్గుమంటోంది. 2015లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఆయిల్ ధర $28 డాలర్లకు పడిపోయింది. కానీ అప్పటి బీజేపీ ప్రభుత్వం దేశంలో ధరలు తగ్గించలేదు.

పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తే… రవాణా ఖర్చులు తగ్గి… దేశంలో కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలు కూడా తగ్గుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం దిగివస్తుంది. సామాన్యులకు ధరలు అందుబాటులోకి వస్తాయి.