Leading News Portal in Telugu

Basara IIIT: ట్రిపుల్ ఐటీలో ఆగని ఆత్మహత్యలు.. చావురాతలను అరికట్టేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలేంటి..? వివరాలివే.. – Telugu News | Student dies of self Murder in Basara IIIT Campus


Basara IIT: బాసర ఐఐటీలో ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న విద్యార్థులంతా మైనర్లే కావడం కేవలం క్యాంపస్‌లోకి అడుగు పెట్టిన వారం, ఏడాదిలోపే సూసైడ్ చేసుకొని చనిపోవడం విచారకరం. అసలు వరుస మరణాల వెనుక కారణాలేంటి..? ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థులు‌ చనిపోతున్నారా..? విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు చేస్తున్న చర్యలేవి ఫలితాన్ని ఇవ్వడం లేదా..? పిల్లల మనసును అక్కడి ప్రొపెసర్లు చదవలేక పోతున్నారా..? బాధలు పంచుకోలేక పోతున్నారా..? ఒత్తిడికి గురవుతున్న..

బాసర ట్రిపుల్‌ ఐటీని విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఉరి తాళ్లకు వేలాడుతూ ఆత్మహత్య చేసుకోవడం అటు అధ్యాపకులను, ఇటు తోటీ విద్యార్థులను ఆవేదనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న విద్యార్థులంతా మైనర్లే కావడం కేవలం క్యాంపస్‌లోకి అడుగు పెట్టిన వారం, ఏడాదిలోపే సూసైడ్ చేసుకొని చనిపోవడం విచారకరం. అసలు వరుస మరణాల వెనుక కారణాలేంటి..? ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థులు‌ చనిపోతున్నారా..? విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు చేస్తున్న చర్యలేవి ఫలితాన్ని ఇవ్వడం లేదా..? పిల్లల మనసును అక్కడి ప్రొఫెసర్లు చదవలేక పోతున్నారా..? బాధలు పంచుకోలేక పోతున్నారా..? ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించడంలో ట్రిపుల్ ఐటీ ఫెయిల్ అవుతుందా..? అందుకే మరణాలా..? ఈ చావురాతలు ఆగలంటే ట్రిపుల్ ఐటీలో చేయాల్సిన తక్షణ మార్పులేంటి..?

బాసర ట్రిపుల్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇంఛార్జ్ వీసీగా వెంకటరమణ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనుకుంటే సమస్యల‌ సుడిగుండం నుండి బయటపడలేక.. విద్యార్థుల ఆత్మహత్యలతో మరింత ఊబిలోకి కూరుకుపోతోంది. ఆత్మహత్యలను అరి కట్టేందుకు ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు ఏవీ ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. జూన్ 13న దీపిక , జూన్ 15న లిఖిత, తాజాగా ఆగష్టు8 న జాదవ్‌ బబ్లూ.. వీళ్లంతా పీయూసీ వన్ విద్యార్థులే కావడంతో కొత్తగా వస్తున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సంగారెడ్డి జిల్లా నారయణ్ ఖేడ్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ బబ్లూ పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి.. ట్రిపుల్ ఐటీలో మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీటు సాధించగా.. ఈనెల 1న క్యాంపస్‌లోకి అడుగు పెట్టాడని సమాచారం.

అయితే కేవలం వారం రోజుల వ్యవధిలోనే జాదవ్ ఆత్మహత్య చేసుకోవడం క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. బబ్లూ క్లాస్‌లకు హాజరైంది కేవలం ఒక్క రోజే కావడంతో అసలు బబ్లూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది‌ ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది. సూసైడ్ నోట్ రాశాడని తెలుస్తున్నా.. ఆ నోట్‌లో ఏముందన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే క్యాంపస్ పోలీసులు మాత్రం జాదవ్ బబ్లూ నాయక్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు పోలీసుల ఓవర్ యాక్షన్‌తో విద్యార్థుల చావులకు అసలు కారణాలు బయటకు రాకుండా పోతున్నాయనే ఆరోపణలున్నాయి. అసలు విద్యార్థుల మరణాలకు క్యాంపస్‌లో అప్రకటిత ఆంక్షలేనని తెలుస్తోంది. కొత్తగా చేరుతున్న విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాల్సింది పోయి.. ఉన్నత చదువులంటే ఆశామాసి కాదంటూ సిబ్బంది భయభ్రాంతులకు గురి‌ చేయడం కూడా ఈ ఆత్మహత్యలకు ఓ కారణమని తెలుస్తోంది. మరో వైపు చిన్న చిన్న సమస్యలకే చావు ఆలోచనల వైపు వెళుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆత్మహత్య కు ఉరినే ఎంచుకోవడం.. అలాంటి పరిస్థితుల నుండి విద్యార్థుల కాపాడేందుకు భద్రత కొరవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది

యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా..

వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ముందస్తు జాగ్రతలపై అధికారులు దృష్టిపెట్టడం లేదని తెలుస్తోంది. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారే తప్ప ఇతర చర్యల గురించి పట్టించుకోవడం లేదు. ట్రిపుల్‌ ఐటీలో ఆత్మహత్యలు ఎక్కువగా హాస్టల్‌ గదుల్లో సీలింగ్‌ ప్యాన్‌కు ఉరి వేసుకున్న ఘటనలే చోటు చేసు కుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీలింగ్‌ ఫ్యాన్‌ల చుట్టూ ఆత్మహత్య చేసుకునేందుకు వీలు లేకుండా ఐరన్‌గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తే కొంత వరకు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు లేకుండా పోతాయని గతంలోనే నిపుణులు సలహాలు, సూచనలు‌ చేశారు కూడా. హాస్టల్‌, తరగతి గదుల భవనాలపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోకుండా ఐరన్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్లు‌ కూడా ఉన్నాయి. వారానికి ఓ‌ సారి విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించడం, ఒత్తిడికి గురి కాకుండా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేపట్టాలి విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో డిమాండ్ వ్యక్తం చేశారు‌ కూడా. కానీ అవేమీ అమలు కాకపోవడంతో ట్రిపుల్ ఐటీ లో వరుస మరణాలు‌ చోటు చేసుకుంటున్నాయి.

ఆ ఆస్పత్రి‌ ఉన్నా లేనట్టేనా

ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు క్యాంపస్‌లో 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యుల కొరత.. మెడిసిన్ , అత్యాధునిక వైద్య పరికరాల కొరత విద్యార్థుల ప్రాణాలను గాల్లో కలిపేస్తుందని తెలుస్తోంది. 9 వేల మంది చదువుతున్న విద్యాలయంలో ఉన్న ఆస్పత్రిలో కేవలం నలుగురు వైద్యులు మాత్రమే ఉండటం.. అత్యవసరమైన ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం.. వేధిస్తోంది. యూనివర్సిటీలో ఉన్న ఆస్పత్రి కేవలం ప్రథమ చికిత్సకే పరిమితం అవడంతో ఆత్యహత్య చేసుకున్న విద్యార్థులను, ప్రమాదాలకు‌ గురైన విద్యార్థులను కాపాడటం సాధ్యమవడం లేదు. అత్యవసర చికిత్సకు భైంసా, నిర్మల్ తరలించేలోపే జరగకూడని నష్టం జరిగిపోతోంది. ఆత్మహత్య వంటి అత్యవసర సమయాల్లో సైతం ప్రథమ చికిత్స చేసి ప్రమాదం నుంచి బయట పడే విధంగా యూనివర్సిటీలో వైద్యసేవలు లేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. గత ఏడాదిన్నరగ అటు విద్యార్థులపై, ఇటు తల్లిదండ్రుల  క్యాంపస్‌లో స్వేచ్ఛగా ఉండేందుకు వీలు లేకుండా ఆంక్షలు ఉండడం కూడా ఓ కారణమని తెలిస్తోంది. మీడియాకు అయితే క్యాంపస్‌లోకి రెండేళ్లుగా అనుమతే లేదు. దీంతో లోపల అసలు ఏం జరుగుతుంది, అసలు సమస్యలు ఏంటనేది బయటకు రావడం లేదు. ఏదేమైనా మరో ప్రాణం గాల్లో కలవక ముందే ఇకనైనా ట్రిపుల్ ఐటీ యంత్రాంగం అలర్ట్ అవుతుందో లేదో వేచి చూడాలి.