భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
రొంపిచెర్ల(చిత్తూరు జిల్లా): బంధువు మృతి చెందడంతో పరామర్శకు వెళ్లిన మహిళ లారీ ఢీకొని మృతి చెందిన ఘటన శనివారం రొంపిచెర్ల -గానుగచింత మార్గంలో చోటు చేసుకుంది. ఐరాల మండలం వరంపల్లెకు చెందిన రమేష్, సంపూర్ణమ్మ(45) దంపతులు శనివారం ద్విచక్రవాహనంలో రొంపిచెర్ల మండలం దాసరిగూడెం వెళ్లి వస్తుండగా గానుగచింత మార్గం వద్ద లారీ ఢీకొంది.
ఈ ఘటనలో సంపూర్ణమ్మ లారీ చక్రం కింద పడి మృతి చెందింది. కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో భర్త రమేష్ కుప్పకూలిపోయాడు. రమేష్ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ సిద్దారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.