పోలీసు చేయినరికిన కేసులో 9 మంది నిందితుల అరెస్ట్.. దాని వెనుక ఉన్న కథ ఇదే..
లాక్‌డౌన్ తనిఖీల్లో భాగంగా కారును ఆపినందుకు పంజాబ్‌లో కొంతమంది దుండగులు ఓ పోలీసు చేయి నరికిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు పాల్పడిన 9 మంది నిందితులను పోలీసులు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. పంజాబ్‌లోని పాటియాలా జిల్లా బాల్బెరా గ్రామంలోని ఓ గురుద్వారాలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల తెలిపారు. అయితే ఈ నిందితులు మాములు మనుషులు కాదండోయ్. వీరి వెనుక పెద్ద ముఠానే ఉంది. వీరంతా 20 మంది ముఠా. అయితే పోలీసులపై దాడికి పాల్పడిన ముఠాలోని 9 మంది నిహాంగ్ వర్గీయులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ముఠా నుంచి ఆటోమెటిక్ కత్తులు, పెట్రోల్ బాంబులు, పదునైన ఆయుధాలతో పాటు రూ.35 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పాటియాలా ఐజీ జతిందర్ సింగ్ ఔలఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులపై దాడి చేసిన తొమ్మిది మంది ముఠాలో ఓ మహిళ ఉండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఆదివారం ఓ వాహనంలో వెళుతున్న ఐదుగురు నిహాంగ్ వర్గీయులను పాటియాలా సబ్జిమండీ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కర్ఫ్యూ పాసులు చూపించాలని పోలీసులు కోరగా, వారు అడ్డుగా పెట్టిన బారికేడ్లను కారుతో ఢీకొట్టి ముందుకు కదిలారు. దీంతో వారిని అక్కడే ఉన్న ఓ ఏఎస్ఐ అడ్డుకోబోగా కత్తితో అతడి చేయిని నరికారు. ఈ దాడిలో మరో ఇద్దరు పోలీసులు సైతం గాయపడ్డారని పాటియాలా ఎస్పీ మందీప్ సింగ్ సిద్దూ పేర్కొన్నారు.