హైదరాబాద్‌లో వలస కార్మికుడు ఆత్మహత్య.. సొంతూరికి వెళ్లలేక..
లాక్‌డౌన్‌తో వలస కార్మికులు నరకం చూస్తున్నారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన వలస కార్మికులంతా.. ఇక్కడే చిక్కుకుపోయారు. కొందరు ఎలాగోలా ఇంటిబాటపట్టినా.. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మాత్రం నగరంలోనే ఉండిపోయారు. లాక్‌డౌన్ వల్ల పనులు లేక.. సొంతూళ్లకు వెళ్లలేక.. అల్లాడిపోతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే బాధతో మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. ఎవరూ బాధపడవద్దని..అందరికీ కడుపు నిండా భోజనం పెడతామని ప్రభుత్వం చెప్పినా.. చాలా మందిలో ఇప్పటికీ ఆందోళన నెలకొంది. ఈ క్ర్రమంలో బీహార్‌కు చెందిన ఓ వలస కార్మికుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతింటికి వెళ్లేకపోయానన్న మనస్థాపంతో తనువు చాలించుకున్నాడు.
24 ఏళ్ల ఓ యువకుడు ఉపాధి కోసం కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక రూమ్‌లోనే ఉంటున్నాడు. ఐతే అతడి స్నేహితుడి ఎలాగోలా హైదరాబాద్ నుంచి తన సొంతూరికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ యువకుడు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇంటికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తాను ఊరికి వద్దామనుకున్నప్పటికీ.. లాక్‌డౌన్ వల్ల రాలేకపోతున్నానని కన్నీరుపెట్టుకున్నాడు. ఐతే బాధపడవద్దని కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. అవసరమైతే తామే డబ్బులు పంపిస్తామని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాననే బెంగతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇప్పటి వరకు 103 మంది కోలుకొని డిశ్చార్జి అవగా.. మొత్తం 17 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 472 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. హైదరాబాద్ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక్క GHMCలోనే 267 మందికి కరోనా వైరసో సోకింది. వీరిలో 51 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 216 యాక్టివ్ కేసులున్నాయి.