Leading News Portal in Telugu

రాత్రివేళ అంతుచిక్కని ఆకారం.. కేరళ ప్రజలకు దెయ్యం భయం

లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా భయంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఐతే కేరళలోని త్రిస్సూర్ ప్రజలకు మాత్రం కరోనాతో పాటు దెయ్యం భయం పట్టుకుంది. రాత్రిళ్లు ఇంటి తలుపులు తెరించేందుకు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఏం క్షణం ఏం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. త్రిస్సూర్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఓ భారీ ఆకారం తిరుగుతోంది. సినిమాల్లో చూపించినట్లుగా దెయ్యాన్ని పోలిన వికృత రూపాన్ని చాలా మంది చూశారు. అది ఆరడుగుల పొడవు ఉందని.. వాయు వేగంతో దూసుకెళ్తోందని చెప్పారు. ఏదైనా అలికిడి వినిపిస్తే మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్తోందని తెలిపారు. అంతేకాదు దాని కాళ్లకు స్ప్రింగ్స్ వంటివి ఉన్నాయని మరికొందరు చెప్పారు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా అచ్చం బ్లాక్‌మ్యాన్‌లా ఉన్నాడని ఇంకొందరు వెల్లడించారు. అదేంటన్ననది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందుకే దాని సంగతేంటో చూసేందుకు పలువురు ధైర్యవంతులు గుంపులుగా ఏర్పడి బయటకొస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ వీధుల్లో తిరుగుతున్నారు.

త్రిస్సూర్‌లో ఓ భారీ ఆకారం తిరుగుతోందని.. దాన్ని మిస్టరీ ఛేదించేందుకు చాలా మంది లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బయటకువస్తున్నారని పోలీసులకు సమాచారం వెళ్లింది. అంతేకాదు ఓ వ్యక్తి ఏకంగా హైకోర్టులో పిటిషన్‌లో వేశాడు. దెయ్యం లాంటి ఆకారం వల్ల చాలా మంది భయంతో వణికిపోతున్నారని దాని సంగతేంటో చూడాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏకే జయశంకరన్, శాజీ పి. చాలీ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషన్ వాదనలను విన్న కోర్టు.. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను విచారించి వివరాలు రాబట్టుతున్నారు. ఐతే ఏ ఒక్కరూ ఆ రూపాన్ని స్పష్టంగా చూడలేదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.

ఐతే కొందరు ఆకతాయిలు దెయ్యం వేషంలో వచ్చి ఇళ్ల డోర్‌లు కొడుతున్నారని.. ప్రాంక్ వీడియోల కోసమో అలా చేస్తున్నారని ఆరోపించారు. ఇలా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ మిస్టరీ రూపాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రిళ్లు ప్రత్యేక బృందాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. మళ్లీ ఎవరికైనా అది కనిపిస్తే 0888522221 నెంబరుకు కాల్ చేయాలని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తాము నిఘా పెంచామని ధైర్యం చెప్పారు. అందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని.. గుంపులు గుంపులుగా బయటకు రాకూడదని స్పష్టం చేశారు. ఐతే ఆ అంతుచిక్కని రూపమేంటన్న దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. దాన్ని సంగతి తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.