Leading News Portal in Telugu

ప్రేమించి పెళ్లి.. 11 నెలల కొడుకును చంపి తానూ ఆత్మహత్య..

ఏమైందో ఏమోగానీ ఓ మహిళ నవమాసాలు మోసి కన్న బిడ్డను 11 నెలలకే కడతేర్చింది. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘంటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ తాండూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారి వివాహబంధం ఆరు నెలల కంటే ఎక్కువగా నిలువలేదు. వారిద్దరూ విడిపోవడంతో శ్రీనివాస్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలసొచ్చాడు. నగరంలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ అక్కడే పనిచేస్తున్న మద్దూర్ గ్రామానికి చెందిన మల్లిక(25)ను ప్రేమించాడు. 2017లో ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకుని నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు.

అయితే ఇటీవల కరోనా వైరస్ భయంతో హైదరాబాద్ నుంచి కుదురుమల్లకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో భార్యభర్తలిద్దరూ తమ కొడుక్కి ఆరోగ్యం బాలేదని కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నా సమయంలో ఇంట్లో వారందరూ బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కుమారుడిన చంపి మల్లిక మరో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అత్త, మామ, భర్తలు బాబును ఎంత పిలిచినా కదలకపోవడంతో చనిపోయినట్టు గుర్తించారు. మల్లిక కోసం గదిలోకి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ చనిపోయి కన్పించింది. స్థానికులు దౌల్తాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.