Leading News Portal in Telugu

దొంగ బాబా మాట నమ్మి… కూతుర్ని చంపేసిన తండ్రి…

ఏ బాబా అయినా… కూతుర్ని చంపమని సలహా ఇస్తారా… ఆ బాబా ఇచ్చాడంటే… అతనెంత దొంగ బాబా అయ్యుంటాడు? అసలెందుకీ పరిస్థితి వచ్చిందో తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్‌… ముజఫర్‌నగర్‌లోని అడవి ప్రాంతం. ఉదయాన్నే అక్కడి ఓ చోట పెద్ద సంఖ్యలో గద్దలు అటూ ఇటూ తిరుగుతూ ఎగురుతున్నాయి. అక్కడ ఎప్పుడూ అలాంటి దృశ్యాన్ని స్థానికులు చూడలేదు. ఐతే… ఆ ఊళ్లో ఓ ముసలాయన… గద్దలవైపు గంభీరంగా చూస్తూ… “జరిగింది… అదే జరిగింది” అన్నాడు. పక్కనున్న స్థానికులు… “ఏందయ్యో ముసలోడా… ఏదో అంటున్నావ్” అనగానే… మళ్లీ ముసలాయన ఆకాశం వైపు చూస్తూ… లేని శక్తి తెచ్చుకుంటూ… “శవం తేలింది” అన్నాడు. పక్కనున్న వాళ్లు ఆశ్చర్యంగా చూశారు. ఏం ప్రశ్నించాలో అర్థం కాలేదు. ముసలాయన వాళ్లవైపు చూసి… “ఏదైనా జంతువు చచ్చేడిస్తే… అప్పుడు గద్దలు ఇట్టాగే ఎగురుతాయి” అన్నాడు. ఆ ఊరోళ్లకు అసలో కరోనా లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటే ఏమీ తోచట్లేదు. అందుకని… అక్కడ ఏ జంతువు చచ్చిందో చూద్దామని బయల్దేరారు.

వాళ్ల కంటే ముందే అక్కడకు ఓ కుక్క వెళ్లింది. ముక్కుతూ, మూలుగుతూ ఉన్న ఆ కుక్క… ఏదో వాసన చూస్తూ… నోటి దాకా వచ్చిన చికెన్ బిర్యానీ నోటికి అందట్లేదే అన్నట్లుగా ముఖం పెట్టుకుంది. ఇంతలో జనాన్ని చూసి… “ఓర్నాయనో ఇంత మందా… ఇటే వస్తున్నారుగా… అయిపోయాను… ఇక నాకు ఇది దొరకనట్లే… ఇంకో చోట వెతుక్కోవాలి” అనుకుంటూ… తోక ముడుచుకొని… ఎముకలు తేలే ఖాళీ పొట్టతో మెల్లిగా జారుకుంది.

ఆ కుక్క, పైన గద్దల్ని చూసిన ప్రజలకు దగ్గరకు వెళ్లాక… అక్కడ ఏదో తేడాగా కనిపించింది. ఎవరో… మట్టిని తవ్వి… మళ్లీ పూడ్చినట్లు అనిపించింది. “మనం చేసే పనేముంది… తవ్వుదామా” అనుకుంటూ… వెంటనే… చుట్టుపక్కల ఎండుకర్రల్ని విరగొట్టి… వాటినే గునపాల్లా చేసి… అక్కడ తవ్వారు. కొద్దిగా తవ్వేసరిగా… ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా అని చూశారు. ఓ కాలి మెత్తని వేళ్లు వాళ్ల చేతులకు తగిలాయి. అప్పుడర్థమైంది. అక్కడ కప్పెట్టింది జంతువు కాదు మనిషి అని… వెంటనే తవ్వడం ఆపేసి… పోలీసులకు కాల్ చేశారు. ఈ మనుషుల్ని చూసి… గద్దలు కూడా… వేరే చోటికి వెళ్లిపోయాయి.

పోలీసులు రావడం, వాళ్ల సమక్షంలో తవ్వడం అన్నీ జరిగాయి. చిన్న పాప. రెండున్నరేళ్ల వయసుంటుంది. ఆ రోజే చనిపోయినట్లుగా ఉంది. ఆ పాపను చూడగానే… స్థానికుల్లో ఓ కుర్రాడు… పోలీసులతో హడావుడిగా ఏదో చెప్పాడు. అంతే… పోలీసులు… అంతే హడావుడిగా… ఊళ్లోకి వచ్చారు. అక్కడి ఓ ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో ఓ వ్యక్తి… కన్నం పడిన బీడీని ఎలా కాల్చాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. పోలీసుల్ని చూడగానే… బీడీ చేతిలోంచీ జారి కింద పడింది. పోలీసులు సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ… లాఠీ కర్రతో… గబగబా నాలుగు ఉతికారు. దెబ్బలు పడగానే… విషయం అర్థమైంది. కొట్టొద్దు సారూ అంటూ ఏడ్చాడు. ఎందుకిలా చేశావంటే… ఓ కథ చెప్పాడు.