Leading News Portal in Telugu

Rave Party: హైదరాబాదులో రేవ్ పార్టీ.. సినీ నిర్మాతతో పాటు పలువురు అరెస్ట్


Rave Party: టాలీవుడ్‎లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్‎లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్‎లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కొకైన్ పలు రకాల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురుని అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ సినీ నిర్మాత వెంకట్‎తో పాటు పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నారు.

అరెస్టయిన వారిని మాధాపూర్ పోలీసులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అప్పజెప్పారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది. వారికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా అపార్ట్ మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో అరెస్టయిన వారితో పాటు మరెవరైనా దాడులకు ముందు పాల్గొన్నారా? అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

గతంలో టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారు. అయితే, కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశం అవుతోంది.