
Prabhas As Lord Shiva in Pan India Movie: పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ప్రభాస్ ఇప్పుడు మహా శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా భక్తకన్నప్ప అనే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సుమారు 100 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాని స్వయంగా మంచు కుటుంబం నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారని తమిళ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ మంచు విష్ణు హర హర మహాదేవ్ అంటూ కామెంట్ చేశారు.దీంతో మంచు విష్ణు హీరో గా నటిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో ప్రభాస్ మహా శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్త తెరమీదకు వచ్చింది.
Also Read: Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!
మహాశివుడి భక్తుడైన కన్నప్ప ఒక బోయవాడు. శ్రీకాళహస్తి చుట్టుపక్కల వేటాడి జీవనం గడిపే అతను శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక శివలింగాన్ని చూసి ఆ శివలింగాన్ని పూజించడం మొదలుపెడతాడు. వేటగాడు కావడంతో వేటలో దొరికిన మాంసాన్నే శివుడికి నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు . మహాశివుడు కన్నప్ప భక్తిని పరీక్షించదలిచి ఒక పరీక్ష పెట్టగా ఏకంగా తన కన్ను పెకిలించి ఆ శివలింగానికి అమర్చి భక్తకన్నప్పగా రూపాంతరం చెందాడు. ఇప్పుడు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా మహా శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక రకంగా అధికారిక ప్రకటనే వచ్చేసిందని భావించవచ్చు. అయితే ప్రభాస్ నిజంగానే నటిస్తున్నారా లేదా మంచు విష్ణు ఆ మేరకు సినిమాకి హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనే విషయం మీద మాత్రం పూర్తి అవగాహన రావాల్సి ఉంది.