తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మౌనంగా ఉంది, చంద్రబాబుకి మద్దతుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడాలి కానీ స్పందించట్లేదు అంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో… “సప్త సాగరాలు దాటి సైడ్ A” సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు స్పందించాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు మౌనంగా ఉంది అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సురేష్ బాబు… “తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదు. తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదు” అంటూ సమాధానం ఇచ్చాడు.