
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. జీ స్టూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎంఎం మూవీస్ బ్యానర్‌లపై అనిల్ శర్మ, కమల్ ముకుత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంది. థియేటర్ లో మాత్రమే కాకుండా జీ5 ఓటిటీలో కూడా తన సత్తా చాటింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది.
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందిన ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అలరించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగ ఈ ఆదివారం గదర్ 2 ను కానుకగా అందించనుంది. ఫిబ్రవరి 18న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ఈ సినిమ ప్రసారం కానుంది. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో తారా సింగ్ (సన్నీ డియోల్) ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. జైలులో ఉన్న తన కుమారుడు చరణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) ను రక్షించడానికి పాకిస్థాన్ నుంచి తిరిగివచ్చిన తారా సింగ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.