
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. గత ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస సక్సెస్ లు అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాస్ హిట్ అందించిన బాబీ.. ఈసారి బాలయ్యతో అంతకుమించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘NBK109’ ప్రాజెక్ట్ నుంచి మోషన్ పోస్టర్ తప్పితే మరే ఇతర అప్డేట్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇలాంటి తరుణంలో ‘NBK109’ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ సినిమాని జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమాని దసరా బరిలో దింపాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ టైం కి ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. దానికంటే ముందు ఆగస్టులో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2’ అలాగే సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలు రాబోతుండడంతో జూలై 19 లేదా 26 తేదీల్లో ‘NBK109’ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.త్వరలోనే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు ‘NBK109’ నుంచి మేకర్స్ టైటిల్ పోస్టర్ తో పాటు టీజర్ ని రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు టీజర్ లోనే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.