
Mamitha Baiju: మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న చిన్నది మమిత బైజు. ఇక ఈ భామ త్వరలోనే తెలుగులో కూడా అడుగుపెడుతుంది. అదేనండీ ప్రేమలు అదే పేరుతో మార్చి 8 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక మమిత ఇటీవల డైరెక్టర్ బాలాపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సెట్ లో తిట్టాడు, కొట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. బాలా- సూర్య కాంబోలో వచ్చిన అచలుడు అనే సినిమాలో ఆమె నటించిన సమయంలో ఒక సీన్ జరిగింది. ఆ సీన్ చేసేటప్పుడు మూడు టేక్స్ తీసుకున్నా కూడా రాలేదు. అప్పుడు డైరెక్టర్ బాలా నన్ను తిట్టారు. అయితే తాను టేకులో ఉన్నప్పుడు తిడతాను.. అదంతా సీరియస్ గా తీసుకోవద్దని చెప్పడంతో నేను వాటిని మనసులో పెట్టుకోలేదు. ఆ తరువాత ఆయన సెట్ లో అందరిముందు నన్ను కొట్టారు కూడా.. సూర్య సర్ కు కూడా ఇది తెలుసు. కానీ, బాలాసర్ తో ఆయన అంతకు ముందే వర్క్ చేశారు కాబట్టి ఏం చెప్పలేకపోయారు. కానీ, ఇది నాకు కొత్త” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో డైరెక్టర్ బాలాపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఇక ఈ నేపథ్యంలోనే మమిత మరోసారి షాక్ ఇచ్చింది. అసలు తాను చెప్పినదాంట్లో నిజం లేదని, డైరెక్టర్ బాలా గురించి తాను ఏమి మాట్లాడలేదని ప్లేట్ తిప్పేసింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టుకొచ్చింది. ” అందరికి నమస్కారం, నేను ఒక తమిళ సినిమా గురించి మాట్లాడనంటూ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలు అన్ని పూర్తిగా నిరాధారమైనవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.నేను డైరెక్టర్ బాలా గురించి తప్పుగా మాట్లాడలేదు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ మరియు ప్రొడక్షన్‌తో సహా దాదాపు ఒక సంవత్సరం పాటు బాలా సర్‌తో కలిసి పనిచేశాను. నన్ను మంచి నటిగా మార్చడానికి ఆయన ఎప్పుడు తోడుగా ఉన్నారు. ఆ చిత్రంలో నేను పని చేస్తున్న సమయంలో నేను ఎలాంటి మానసిక లేదా శారీరక హానిని లేదా ఎలాంటి అసభ్యకరమైన ప్రవర్తనను అనుభవించలేదు. ఇతర వృత్తిపరమైన కమిట్మెంట్ల కారణంగా నేను ఆ చిత్రం నుండి తప్పుకున్నాను. ప్రచురించే ముందు వార్తలను నిజమో కాదో తెలుసుకొనేందుకు నన్ను సంప్రదించిన మీడియా హౌస్‌లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్థం చేసుకునందుకు మీకు ధన్యవాదములు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసాక.. చాలామంది వీడియోలో అంత క్లారిటీగా చెప్పింది.. ఇప్పుడేమో అసలు తాను అనలేదు అంటుందేంటి అని గుసగుసలాడుతున్నారు.