
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు గడవక ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టివి కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ దాని నిమిత్తం చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం నాడు కనుమూశారు. గత కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన నిమ్స్ లో మంగళవారం చేరారు. వెంకట రమణ స్వస్థలం మచిలీపట్నం. తెలుగు బుల్లితెర మీద విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు, లాంటి సీరియళ్లకు కెమెరామాన్ గా వెంకటరమణ పనిచేసారు. ఎస్ వి బి సి ఛానల్ నిర్మించిన “శ్రీ వైనతేయ” ధారావాహికకు 2009 సంవత్సరం ఉత్తమ కెమెరామాన్ గా నంది పురస్కారం కూడా అందుకున్నారు.
Also Read; Kishan Reddy: హైదరాబాద్లో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాదు..
ప్రస్తుత టాప్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీఫిల్మ్ “జీవితం”కు కూడా పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎడిటర్ కావడం గమనార్హం. వెంకట రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి టివి కెమెరామాన్ ల సంఘంతో పాటు టివి పరిశ్రమలోని పలువురు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నాయని సన్నిహితులు వెల్లడించారు. గత మూడు రోజుల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు కన్నుమూశారు. చిత్ర కారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్, డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తూ వచ్చిన శ్రీ రామకృష్ణ, తెలుగు, తమిళ సినిమాలలో కమెడియన్ గా మెప్పించిన విశ్వేశ్వర రావు కన్నుమూశారు.