ప్రపంచానికి పెద్దగా తెలియని ఇర్ఫాన్ ఖాన్ ప్రేమ కథ…
విలక్షణ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశాడు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా శ్మశానవాటిలో పూర్తయ్యాయి. ఇర్ఫాన్ ఖాన్కు భార్య సుతాపా సిక్దర్, ఇద్దరు కొడుకులు బాబిల్, అయాన్ ఉన్నారు.
ఇర్ఫాన్ ఖాన్ గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రేమ కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దర్ కూడా ఆయన వెంట సినీ ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు. కానీ, ఎప్పుడూ ప్రజల కంట్లో పెద్దగా పడలేదు. ఫ్లాష్ లైట్లకు కొంచెం దూరంగానే ఉండిపోతారు. అయితే, పాతికేళ్ల వారి కాపురంలో ఇర్ఫాన్ ఖాన్కు డైలాగ్స్ రాయడం, తన సినిమా పనిలో సాయం చేయడంలో ఆమె పాత్ర కూడా ఉంది.
ఇర్ఫాన్ ఖాన్, సుతాపా ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో క్లాస్ మేట్స్. ఆ రోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్లో ఉన్న కళను కనిపెట్టారు మీరా నాయర్. 1986లో మీరా నాయర్ సలాం బాంబే కోసం పనిచేస్తున్న సమయంలో ఆమె ఇర్ఫాన్ ఖాన్లో ఉన్న నటుడిని పసిగట్టారు. ఇర్ఫాన్ ఫోకస్, నిశితంగా గమనించే తత్వం, ఆ లుక్, ఆ కళ్లను ఆమె బాగా గమనించారు.