మనిషి ఆయుష్షు సాధారణంగా వందేళ్లు. అందుకే మన పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని అంటూ ఉంటారు. మన పెద్దలు 100 ఏళ్లకు దగ్గర వరకు బతికేవారు. అయితే మారుతున్న జీవన శైలితో మనిషి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 60 సంవత్సరాలకు పైన బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని అలవాటును మార్చకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. వాటిలో ఒకటి మంచి ఆహారం తీసుకోవడం.
మన ఆరోగ్యం, ఆయుష్షు కచ్ఛింగా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ ల వినియోగం అధికమయిపోయింది. చిరుతిండ్లకు అందరూ అలవాటుపడుతున్నారు. దీంతో శరీరంలో కొవ్వు పెరుకుపోయి ఊబకాయ సమస్య ఎక్కువ అయిపోతుంది. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన వంటకాలనే తినాలి. కొవ్వు ఎక్కువ ఉండే పదార్థాలు కాకుండా సరిపోయే మోతదులోనే నూనెలను తీసుకోవాలి. కాల్చిన వేయించిన వంటకలను తగ్గించాలి. చల్లని పదార్థాల వినియోగాన్ని కూడా తగ్గిస్తే చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా నవ్వుతూ భోజనం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని కొన్ని సర్వేలలో వెల్లడయ్యింది. ఇక ఎప్పడుపడితే అప్పుడు కాకుండా సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో మితంగా తినాలి.
ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర మంచి ఔషధం. అందుకే నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు రోజుకు 6 గంటలు అయినా ప్రశాంతంగా నిద్రపోవాలి. రాత్రిపూట లేట్ గా కాకుండా త్వరగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా లేవాలి. దీనిని అలవాటుగా మార్చుకోవాలి. ఇక పని ఒత్తిడి నుంచి బయటపడటానికి మధ్య మధ్యలో మనకు నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆలోచనలు కూడా మనిషి ఆయుష్షుపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి. ఆలోచనలు మంచిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల గుండె సమస్యలు, మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. మంచి స్నేహితులతో కాలం గడపడం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.