Leading News Portal in Telugu

Near Death Experience: మరణించాక ఆత్మ ఏం చేస్తుంది?.. సంచలన ప్రకటన చేసిన అమెరికా డాక్టర్


Near Death Experience: నిజంగా ఆత్మలు ఉంటాయా? చనిపోయిన తరువాత మనిషి జీవితం అక్కడితో అయిపోతుందా? ఆత్మ నిజంగా ఉంటే మనిషి మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది. కొన్ని సినిమాల్లో చూపించినట్లు ఆత్మ అంతక ముందు చనిపోయిన వారిని కలుసుకుంటుందా? వైతరణి అనే పెద్ద నదిని దాటి, స్వర్గానికి కానీ, నరకానికి కానీ వెళుతుందా? అసలు అలాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలు మనలో చాలా ఉంటాయి.ఇక మన భారతీయులలో అయితే చిన్నప్పటి నుంచే అమ్మమ్మలు, తాతయ్యలు దెయ్యాల కథలు చెబుతూ పెంచుతారు. అప్పటి నుంచే మనలో నిజంగా ఆత్మలు, దెయ్యాలు ఉంటాయా అనే సందేహం మొదలవుతుంది. అయితే ఆత్మల ఉనికికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే తాజాగా ఆత్మ నిజమేనని, మరణం తరువాతా ఓ జీవితం ఉందని అమెరికాకు చెందిన ఓ డాక్టర్ సంచలన ప్రకటన చేశాడు. ఇక ఈయన ఇలా ప్రకటించడానికి ముందు మరణం అంచులవరకు వెళ్లిన 5 వేల మందిని అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది.

గుండె అకస్మాత్తుగా కొన్ని క్షణాల ముందు ఆగిపోవడం లేదా కోమా లో ఉన్నవారు చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చే స్థితినే నియర్ డెత్ ఎక్స్ పీరియన్స్ అంటారని జెఫ్రీ పేర్కొన్నారు. అలాంటి వారి శరీరం కదలకుండా, చలనం లేకుండా పడిఉన్న వారి ఆత్మ మాత్రం బయటకు వచ్చి తమ చుట్టుూ ఉన్న ప్రపంచాన్ని చూడగలుగుతుందని, అక్కడి వారు మాట్లాడే మాటలను వినగలుగుతుందని జెఫ్రీ తెలిపారు. ఇక చనిపోయిన కొంతమంది తమ ఆత్మ ఒక సొరంగం నుంచి ప్రయాణించిందని అక్కడ చనిపోయిన తమ బంధువులను, స్నేహితులను కలిసినట్లు తెలిపారని జెఫ్రీ తెలిపారు. ఇది మాత్రమే కాకుండా కొంత మంది స్వర్గం, నరకం చూశామని కూడా తెలిపారని వెల్లడించారు. ఇక ఆత్మలు, శరీరం నుంచి ఇలా బయటకు వెళ్లాక ఏం జరుగుతుందో తెలియని వారు కూడా తమ శరీరం చలనం లేకుండా పడి ఉండగానే చనిపోయిన తమ స్నేహితులను, బంధువులను కలిశామని పేర్కొన్నట్లు జెఫ్రీ తెలిపారు. వీటిని నిరూపించడానికి తన దగ్గర ప్రత్యేకంగా ఆధారాలు లేకపోయినప్పటకీ ఇది నిజమని జెఫ్రీ నొక్కి వాక్కానిస్తున్నారు.