Vinayaka Chavithi: వినాయక చవితి పండగను సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? లేదా సెప్టెంబర్ 19న జరుపుకోవాలా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ పండుగ విషయంలో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. పండితుల మధ్య భారీగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ విద్వత్సభ, భాగ్యనగర్ ఉత్సవ సమితి వేర్వేరు ప్రకటనలు విడుదల చేయడంతో భక్తులు మరింత గందరగోళానికి గురయ్యారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించగా.. సెప్టెంబర్ 19న వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి తీర్మానించింది. ఇంతకీ ఎవరి వాదనలో నిజం ఉందో తెలుసుకుందాం ?
గడిచిన ఏడాది కాలంగా పండుగల విషయంలో తీవ్ర సందిగ్ధం తలెత్తుతోంది. ఇందుకు కారణం పండుగలకు సంబంధించిన తిథులు ఒక రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం మొదలై.. మరుసటి రోజు మధ్యాహ్నానికి ముగుస్తున్నాయి. రాఖీ పండుగ విషయంలోనూ ఇలాంటి సందిగ్ధతే ఎదురైంది. ఇక వినాయక చవితి పండుగ విషయంలో నెలకొన్న సందిగ్ధంపై చర్చించేందుకు వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతులు సమావేశమయ్యారు. జూలై 22, 23న షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి పండగ తేదీని ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో వినాయక చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి (సెప్టెంబర్ 18) సోమవారం రోజు నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్ సభ సూచించింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచే నవరాత్రులను ప్రారంభించాలని తెలిపింది. శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండగల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పీఠాలకు విద్వత్సభ సమర్పిస్తూ ఉంటుంది. ఈ ఏడాది హైదరాబాదులో దాదాపు 32,500 వరకు వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.