4 Natural Remedies to Stop Hair Fall: మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వాయు కాలుష్యం, వివిధ రకాల రసాయనాలతో కూడిన షాంపూలు వాడటం, శరీరానికి అవసరమైన విటమిన్లు సమపాళ్లలో తీసుకోకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే.. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి నడివయసు వారి వరకు అధికంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు, యుక్త వయసులోనే జుట్టు తెల్లబడటం వంటివి ఉంటున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ఆయిల్స్, షాంపూలను వాడుతూ ఉన్న జుట్టును కూడా పాడు చేసుకుంటున్నారు. ఫలితంగా మూడు పదుల వయసైనా నిండకుండానే బట్టతల వచ్చేస్తుంది.
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని మెషీన్లలా పనిచేయడం వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది. అలాగే శరీరంలో వేడి ఎక్కువైతే దాని ఎఫెక్ట్ ముందు జుట్టు పైనే పడుతుంది. జుట్టు ఒత్తుగా ఉండాలని అందరి కోరిక. ఆడవారైతే తమకు పొడవాటి జుట్టు కావాలనుకుంటారు. కానీ అందుకోసం ఏం చేయాలో తెలియక.. మార్కెట్లో దొరికే ఏదొక ప్రొడక్ట్ ను వాడేస్తూ.. ఉన్న కాసిన్ని కురులను కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. మరి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంతో పాటు చుండ్రు కూడా తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
1. ఒక మిక్సీ జార్ లోకి రెండు రెమ్మల కరివేపాకు, తోలు తీయకుండా ముక్కలుగా కట్ చేసిన ఒక కలబంద రేకు, రెండు స్పూన్ల బియ్యం, రెండు స్పూన్ల కొబ్బరినూనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లా చేసుకుని.. ఒక క్లాత్ సహాయంతో వడగట్టుకోవాలి. ఆ రసాన్ని జుట్టుకు కుదుళ్ల నుంచి చివళ్ల వరకూ రాసి.. ఒక గంట తర్వాత హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టురాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.
2. జుట్టు రాలడాన్ని నివారించడంలో కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. ఒక పావులీటర్ కొబ్బరినూనెను పాత్రలో పోసి.. అందులో గుప్పెడు ఎండిన మందారపువ్వులు, 1 కప్పు గోరింటాకు, అరకప్పు కరివేపాకు, కొద్దిగా తులసి ఆకులు, గుప్పెడు వేపాకు, చిటికెడు ముద్ద కర్పూరం వేసి పచ్చి వాసన పోయేంత వరకు మరిగించాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో వడగట్టుకుని ప్రతిరోజూ జుట్టుకు రాసుకోవచ్చు. దీనివల్ల జుట్టు పెరగడంతో పాటు చుండ్రు కూడా తగ్గుతుంది.
3. మెరిసే జుట్టు కోసం రకరకాల కండిషనర్లను వాడటం వల్ల జుట్టు చిట్లి పోతుంటుంది. అవిసె గింజలు చిట్కాలు పాటిస్తే ఎలాంటి కండీషనర్ అక్కర్లేదు. ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి.. అది జిగురుగా వచ్చేంత వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత దీనిని జుట్టుకు రాసుకుని.. ఒక పావుగంట తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకుంటే చాలు. జుట్టు షైన్ గా కనిపించడంతో పాటు.. ఒత్తుగా కూడా పెరుగుతుంది.
4. చుండ్రును తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. ఒక రాత్రంతా నానబెట్టిన మెంతుల్ని.. ఒక కప్పు పెరుగుతో కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. ఒక గంట తర్వాత షాంపూతో తలంటుకోవాలి. వారానికి ఒక్కసారి ఇలా చేసినా.. చుండ్రు తగ్గి.. జుట్టు మెత్తగా, ఒత్తుగా ఉంటుంది.