Leading News Portal in Telugu

World COPD Day: నేడు ప్రపంచ సిఓపిడి రోజు.. ఊపిరితిత్తుల ఆరోగ్యమే మన ధ్యేయం!



World Cop Day

‘క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్’ (సిఓపిడి) అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తుల నుంచి గాలి గుండెకు చేరటానికి అవరోధం కలగటంనుంచి ఊపిరితిత్తులలో ఉండే సన్నపాటి వాయుగోళాలు నశించిపోవటం లేదా దెబ్బతినటం, రక్తనాళాలు దెబ్బతినటం వంటి అనేక ఇబ్బందులు ఇమిడి ఉండవచ్చు. కాలక్రమేణా ఊపిరితిత్తులు పాడయినకొద్దీ, గాలి పీల్చుకోవటం బహుకష్టమవుతుంది. ‘సిఓపిడి’ అనే సమస్యలో క్రానిక్ బ్రాంకైటిస్ (ఊపిరితిత్తుల వద్ద ఉండే వాయుగోళాల వాపు), ఎంఫెసెమా (ఊపిరితిత్తులు దెబ్బతినటం) వంటివి కూడా జతపడి ఉండవచ్చు.

సిఓపిడి సాధారణమైనదేనా? ఇది ప్రమాదకరమా?
‘సిఓపిడి’ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాలలో మూడోవంతు మరణాలకు కారణమవుతున్నట్లు తేలుతోంది. మధ్యస్థాయి లేదా, తక్కువ ఆదాయాలు ఉన్న దేశాలలో ఈ మరణాలు మరింత అధికంగా ఉంటున్నాయి. విశ్వవ్యాప్తంగా అయితే సుమారుగా 34 కోట్ల 40 లక్షలమంది ప్రజలు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి కారణంగా కాగల వ్యయప్రయాసలు మరింతగా పెరిగే సూచనలూ ఉన్నాయి. ఏటా సుమారు 30 లక్షలమంది ఈ సమస్య వల్ల కన్నుమూస్తున్నారన్న లెక్కలు ఉన్నాయి.

Guinness Record: పళ్లతో గిన్నీస్ రికార్డు సాధించిన భారతీయ మహిళ

‘ప్రపంచ సిఓపిడి దినం’ ఏమిటి, ఈ ఏడాది థీమ్ ఏమిటి?
ప్రతీ ఏటా నవంబర్ నెలలో 3వ బుధవారాన్ని ‘ప్రపంచ సిఓపిడి దినం’గా పరిగణిస్తున్నారు. ‘బ్రీతింగ్ ఈజ్ లైఫ్ – యాక్ట్ ఎర్లియర్’ అనేది ఈ ఏడాది ‘ప్రపంచ సిఓపిడి దినం’ థీమ్ అంటే, ‘శ్వాసించడమే జీవితం త్వరగా మేలుకోవడమే ఉత్తమం’ అని అర్థం అనుకోవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యపరిరక్షణ, త్వరితమైన రోగనిర్ధారణ, సత్వరమైన చికిత్స అనేవి ఎంత ఆవశ్యకమో అందరి దృష్టికీ తేవడమే ఈ థీమ్ లక్ష్యం. మీకు ఉన్నవి ఒకేజత ఊపిరితిత్తులు. తల్లిగర్భంలో మనం ఉన్నప్పుడు అవి రూపొందటం ఆరంభం అయిన్పటినుంచీ మనం పెద్దవారమయ్యేకొద్దీ, ఆ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటేనే.. మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలమన్నది యదార్థం.

‘సిఓపిడి’ ముప్పు ఎవరికి సంభవించవచ్చు?
1.సిగరెట్, బీడి, చుట్ట, మారియువానా వంటి మత్తుమందులు పొగాకు ఉత్పత్తుల వ్యసనం గలవారికీ
2.వాతావరణ కాలుష్యం బారిన పడినవారికీ, పడుతున్నవారికీ
3.వంటిళ్లలో నుంచి వెలువడే బయోమాస్ ఫ్యూయల్ కారణంగానూ
4.ఆర్గానిక్, ఇనార్గానిక్ సంబంధిత దుమ్ము, ధూళి, రసాయనిక పదార్థాలనుంచి వచ్చే పొగలవల్ల కూడా సిఓపిడి రాగల ప్రమాదం ఉంది.

‘ఈ-సిగరెట్’ అంటే ఏమిటి? వీటిని వాడటం క్షేమకరమేనా?
పొగాకు తాగటం అంటే ఊపిరితిత్తులలోకి నికొటిన్ పొగలను పంపటం అన్నమాట. ఈ పొగాకు పొగలను నేరుగా పొగాకు ఉత్పత్తులనుంచి కాకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపే విధానమే ‘ఈ-సిగరెట్’. ఇదొక ‘ఎలక్ట్రానిక్ నికొటిన్ డెలివరీ సిస్టమ్’. ఒక క్యాట్రిడ్లో ఒకరకమైన ద్రవం, బ్యాటరీ సాయంతో పనిచేసే చిన్న హీటింగ్ ఎలిమెంట్తో ఆ ద్రవాన్ని ఆవిరి చేసి పంపేందుకు ఒక ఆటమైజర్ ఇవన్నీ కలిసిన సిస్టమ్ ‘ఈ-సిగరెట్’. వీటిని వాడటం క్షేమదాయకం కాదు. మామూలు సిగరెట్ వాడటం ఎంత ప్రమాదకరమో, ‘ఈ-సిగరెట్’ కూడా అంతే హానికరం. ఈ-సిగరెట్లు, ఇతర పొగాకు ఆవిరి ఉత్పత్తుల వంటి వాడకం పూర్తిగా మానటం తప్పనిసరి.

Andela Sriramulu : మహేశ్వరం ప్రజల చూపు బీజేపీ వైపే

‘సిఓపిడి’ లక్షణాలు ఎలా ఉంటాయి?
కఫం, కళ్లెతోకూడిన దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టం కావటం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు గురక వంటి శబ్దాలు రావటం, గుండె పట్టినట్లు ఉండటం, అలసట వంటి లక్షణాలు ‘సిఓపిడి’లో కనిపిస్తాయి.

‘సిఓపిడి’కి చికిత్స ఏమిటి?
వ్యాధిగ్రస్థమైన ఊపిరితిత్తులకు మందులను నేరుగా పంపే ‘ఇన్హెల్డ్ థెరపీ’ అత్యుత్తమం. సాధారణమైన రీతిలో నోటిద్వారా తీసుకునే మందులకన్నా, వీటివల్ల ఇతర సైడ్ ఎఫెక్టులు అంతగా ఉండవు. అయితే.. ఎట్టి పరిస్థితులలోనూ మీ సొంత వైద్యం వద్దు. మీ పుల్మనాలజిస్ట్ మీకు సిఫార్సు చేసిన మందులను మాత్రమే, వారు సూచించిన ప్రకారమే తీసుకోండి.

‘సిఓపిడి’ని నిరోధించగలమా?
అది సాధ్యమే! ‘గోల్డ్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్’ ప్రకారం ‘సిఓపిడి’ అనే దాన్ని పూర్తిగా నిరోధించవచ్చు, చికిత్స చేయవచ్చు.
1. మీకు పొగ తాగే వ్యసనం ఉన్నట్లయితే, వెంటనే మానెయ్యండి. పొగ తాగటం మానే విషయంలో మీకు ఏ సహాయం కావాల్సిఉన్నా, మీ పుల్మనాలజిస్టును సంప్రదించండి.
2. కాలుష్యం, దుమ్మూధూళి, రసాయన వాయువులు, హానికర ఆవిర్లు, పొగలు దూరంగా ఉండండి.
3. నియమిత విధానాల ప్రకారం శారీరక వ్యాయామం చేయండి.
4. మీ వయసు, మీ పరిస్థితులకు అనుగుణంగా- ఇన్ఫ్లూయెంజా, న్యుమోకోకల్ వాక్సినేషన్లను వేయించుకోండి.