Leading News Portal in Telugu

Pregnant Women Diet: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తాగడం ప్రమాదకరం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం!


  • చక్కెర పానీయాలు ప్రమాదం
  • ప్రెగ్నన్సీ మహిళలలో సమస్యలు
  • ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్న పరిశోధకులు
Pregnant Women Diet: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తాగడం ప్రమాదకరం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం!

Sugar Drinks harmful for Pregnant Womens: చక్కెర పానీయాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అదే ప్రెగ్నన్సీ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకునే మహిళలపై మాత్రమే కాదు వారి పుట్టబోయే పిల్లలపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయట. ఈ సర్వే ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2023లో నిర్వహించబడింది. ఈ సర్వేలో 4 వేల మందికి పైగా గర్భిణులకు పండ్ల రసం, కార్బోనేటేడ్ పానీయాలు, సోడా, జ్యూస్ మరియు పాల ఉత్పత్తులు ఇచ్చారు. చక్కెర పానీయాలు అధికంగా తీసుకునే స్త్రీలు.. గర్భధారణ సమయంలో మధుమేహం సమస్యతో బాధపడుతున్నారని తేలింది.

గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. అంటే పిల్లల బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా శిశువుకు కామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వారానికి మూడుసార్లు చక్కెర పానీయాలు తీసుకునే మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38 శాతం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా 64 శాతం గర్భధారణ రక్తపోటు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

గర్భధారణ సమయంలో చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల పిండానికి తగినంతగా రక్తం సరఫరా కాదని, దాని కారణంగా శిశువు పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది. దీని కారణంగా అకాల డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయట. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు అంటున్నారు.