- భారతదేశంలో రోజురోజుకి ఎక్కువతున్న ఊబకాయం సమస్య.
- బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 23 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయ సమస్య వచ్చే అవకాశం.
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23 పైబడితే అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వెల్లడైంది. ఢిల్లీలోని ఎయిమ్స్, డయాబెటిస్ అసోసియేషన్, ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనం భవిష్యత్తులో ఊబకాయం వల్ల ఎదురయ్యే ఆందోళనకర పరిస్థితులపై దృష్టి సారించింది. ఇకపోతే ఊబకాయం వల్ల కలిగే ప్రధాన వ్యాధులు గురించి చూస్తే..
మధుమేహం:
టైప్ 2 మధుమేహానికి ఊబకాయం ప్రధాన కారణంగా గుర్తించబడింది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అధికం కావడానికి దారితీస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మెటాబాలిజం సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయంతో బాధపడేవారిలో మధుమేహం సాధారణంగా కనిపిస్తుంది. బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు మధుమేహం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉంటాయి.
గుండె జబ్బులు:
గుండె ఆరోగ్యం కోసం ఊబకాయం చాలా ప్రమాదకరమైన అంశం. అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో ఫలకాలు ఏర్పడి గుండెపోటు మరియు గుండె వైఫల్యానికి దారితీస్తుంది. అంతేకాక, ఊబకాయం వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇది గుండెకు అదనపు ఒత్తిడి తెస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో గుండె పనితీరు బలహీనపడుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ :
ఊబకాయం మెదడుకు కూడా ముప్పుగా మారుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు మెదడు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి పక్షవాతం వచ్చే అవకాశాలను పెంచుతుంది.
ఇక ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను చూస్తే.. సక్రమమైన ఆహార అలవాట్లు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజు 30-60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వాళ్ళ శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం, ఆల్కహాల్, మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. ఇక సమయానికి రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలతో ఏవైనా వచ్చే ఇబ్బందులను కంట్రోల్ లో పెట్టవచ్చు.