- శరీరంలో జింక్ కీ రోల్
- ఇమ్యూనిటీ, జీవక్రియ, హార్మోన్ నియంత్రణ, కణజాల పెరుగుదలలో జింక్ అవసరం
- శరీరంలో జింక్ లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు.
జింక్ (Zinc) మన శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం. ఇమ్యూనిటీ, జీవక్రియ, హార్మోన్ నియంత్రణ, కణజాల పెరుగుదలలో జింక్ సహాయపడుతుంది. అంతే కాకుండా.. జింక్ రుచి, వాసనను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. అయితే.. శరీరంలో జింక్ లోపం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇంతకు జింక్ లోపం లక్షణాలు, దాని ప్రభావం.. జింక్ లోపాన్ని నివారించే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జింక్ లోపం లక్షణాలు:
జింక్ లోపం శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో.. వ్యక్తులు తరచూ అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా.. గాయాల నయం ఆలస్యం, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, రుచి మరియు వాసన శక్తి కోల్పోవడం, పెరుగుదల మందగించడం వంటి సమస్యలు జింక్ లోపం వల్ల వస్తాయి. పిల్లలలో జింక్ లోపం వారి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. పెద్దలలో అలసట, మానసిక ఆరోగ్య సమస్యలు, లైంగిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం ప్రభావాలు వెంటనే కనిపించకపోయినా.. కాలక్రమేణా శరీరాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల జింక్ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం.
జింక్ లోపాన్ని నివారించే ఆహారాలు:
మాంసం
మాంసం జింక్ అద్భుతమైన మూలం. ముఖ్యంగా ఎరుపు మాంసంలో జింక్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా.. చికెన్, టర్కీ కోళ్లలో కూడా ఉంటుంది. మాంసాహారులు ఈ ఆహారాలను తింటే జింక్ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు.
సీఫుడ్
షెల్ఫిష్ (గుల్ల), పీత, రొయ్యలు, చేపలలో జింక్ అధికంగా ఉంటుంది. సీఫుడ్‌లో జింక్ మాత్రమే కాకుండా.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి.
పప్పులు, విత్తనాలు
పప్పులు (చిక్కుడు, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్).. విత్తనాలు (గుమ్మడికాయ గింజలు, నువ్వులు, అవిసె గింజలు) జింక్ పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తినని వారు ఇవి తినొచ్చు.
పాల ఉత్పత్తులు
పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో జింక్‌తో పాటు కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
గింజలు, తృణధాన్యాలు
గోధుమలు, బియ్యం, జీడిపప్పు, బాదం, వాల్నట్ వంటి గింజలలో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. తృణధాన్యాల్లో “ఫైటేట్స్” అనే పదార్థం ఉంటే.. అది జింక్ శోషణను కొంతమేర తగ్గిస్తుంది. కాబట్టి, వీటిని మొలకెత్తించి లేదా పులియబెట్టి తీసుకోవడం మంచిది.