- వేడి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర.
- వేడి నీరు తాగడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం.
- వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.

Drinking Warm Water: నీరు మన జీవితానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది చల్లని నీరు తాగే అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను చాలామంది గుర్తించరు. వైద్య నిపుణుల ప్రకారం.. వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. అయితే ఉదయాన్నే వేడి నీరు తాగడం శరీరానికి ప్రత్యేకమైన లాభాలను అందిస్తుంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచేలా చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు మలినాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
కొన్ని పరిశోధనలు వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై తక్కువగా దృష్టి సారించినప్పటికీ, అనుభవపూర్వకంగా చూసినప్పుడు వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు వేడి నీరు తాగడం ద్వారా కొంతమంది ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే, రాత్రి వేడి నీరు తాగడం మూలంగా రాత్రి సమయంలో మలమూత్ర విసర్జన కోసం లేచే అవకాశం ఉంటుంది.
ఇక వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..
ముక్కు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం:
వేడి నీరు ఆవిరి పీల్చడం ద్వారా ముక్కులో కఫం తొలగించేందుకు సహాయపడుతుంది. వేడి నీటి ఆవిరిని లోపలికి పీల్చుకోవడం ద్వారా ముక్కులోని బ్లాకేజ్, సైనస్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే, గోరు వెచ్చని నీరు ముక్కు ఇంకా గొంతును వేడిగా ఉంచి గొంతు నొప్పి తగ్గించేందుకు సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలకు ఉపశమనం:
వేడి నీరు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరంలో పోషకాలను శోషించుకునే విధానాన్ని వేడి నీరు మెరుగుపరచగలదు. ముఖ్యంగా, పగటిపూట గోరు వెచ్చని నీరు తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
మలబద్ధకం నివారణ:
నీటిశోషణ లేకపోవడం వల్లనే మలబద్ధకం ప్రధానంగా ఏర్పడుతుంది. వేడి నీరు శరీరాన్ని తేమతో నింపడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఉదయాన్నే వేడి నీరు తాగడం శరీరానికి మేలుగా పని చేస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరచడం:
వైద్య నిపుణుల ప్రకారం, రక్త ప్రసరణ ఆరోగ్యంగా ఉండటం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. వేడి నీటితో స్నానం చేయడం ఎలా రక్తనాళాలను విస్తరింపజేస్తుందో, అలాగే వేడి నీరు తాగడం కూడా రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మొత్తానికి వేడి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది హైడ్రేషన్, జీర్ణ వ్యవస్థ మెరుగుదల, రక్త ప్రసరణ మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ జీవితంలో వేడి నీరు తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలను పొందొచ్చు.