Leading News Portal in Telugu

Are you suffering from insomnia during pregnancy?


Sleeping Problems : ప్రెగ్నెన్సీ లో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..!

ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీకి ఆనందకరమైన క్షణం. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో శిశువు ప్రధాన అవయవాలు తల్లి శరీరంలో ఏర్పడతాయి. దీని కారణంగా స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే వైద్యులు కూడా మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఎందుకంటే ఈ మొదటి ఈ మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మొదటి మూడు నెలలు దాటిన తర్వాత పిండం బలపడుతుంది. ఇక శిశువు హృదయ స్పందన, ఎంబ్రియో గ్రోత్ నిర్ధారించడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత అల్ట్రాసౌండ్‌ టెస్టులు చేస్తారు. అప్పుడు లోపల బేబీ హెల్త్ గురించి క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అందరు ఆడవారికి ఒకేలా ఉండదు. కొందరు మంచిగా తిని హెల్దీగా ఉంటారు. మరి కొంత మందికి ఏం తినాలనిపించదు, తిన్న కూడా వామిటింగ్ అవ్వడం లాంటిది జరుగుతుంది. అయితే ఈ సమయంలో నిద్ర చాలా ముఖ్యం. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది గర్భిణులు నిద్రలేమి తనంతో బాధ పడుతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం..

1. సరైన నిద్ర లేకపోతే సాధారణ వ్యక్తులే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది కడుపులో బిడ్డను మోస్తున్న తల్లి నిద్ర సరిగా లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రెగ్నెన్సీ మొదట్లో చాలా మత్తు నిద్ర వస్తుంది. కానీ చివరి నెలలకు చేరుకున్న తర్వాత నిద్ర అనేది లేకుండా పోతుంది. పూర్తిగా మాయమై పోయినట్లు అనిపిస్తుంది. చాలా మంది గర్భవతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.

2. అయితే గర్భిణీ ఈ సమస్య నుంచి బయట పడాలంటే, కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ చివరి నెలలు వచ్చే సరికి శరీరం పూర్తిగా మారుతుంది. అలసట, ఒళ్లు నొప్పులు వంటివి మరింత ఇబ్బంది పెడతాయి. వీటి కారణంగా ఎంత ప్రయత్నించినా రాత్రిపూట నిద్ర పట్టదు. ఇలాంటప్పుడు మసాజ్ మీకు చాలా సహాయపడుతుంది. మసాజ్ ద్వారా ఒత్తిడి లేదా అలసటతో ఉన్న కండరాలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇది చక్కటి నిద్ర ను అందిస్తుంది. కాబట్టి రాత్రి పడుకోవడానికి ముందు మీ కాళ్ళు, చేతులు లేదా మెడకు చక్కగా మసాజ్ చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు చక్కగా నిద్ర పడుతుంది. అలాగే నైట్ వాక్ కూడా మంచిది ఓపిక ఉన్నంత వరకు వాక్ చేయడానికి ప్రయత్నించడం మంచిది.

3. గర్భధారణ సమయంలో చురుకుగా ఉండటం వల్ల మీకు,మీ బిడ్డకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి యోగా మంచి ఎంపిక ఎందుకంటే ఇది మీ కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. ఇందులో భాగంగా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల కూడా కండరాలలోని ఒత్తిడి తగ్గుతుంది. మీ గుండె కొట్టుకునే వేగం తగ్గి మీకు త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ముందుగా మీ కాళ్లను చాచి పడుకోండి. శరీరానికి మద్దతు ఇవ్వడానికి కడుపు కింద, కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని, ఆ తర్వాత నోరు మూసుకొని ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి. ఈ విధంగా లోతైన శ్వాస తీసుకోవడం అనేది నిద్ర పట్టడానికి మీకు బాగా సహాయపడుతుంది. పడుకునే ముందు బెడ్ మీద ఇలా చేయండి.

4. ఇష్టమైన పనులు చేయడం వల్ల కూడా ఫలితంగా హాయిగా నిద్ర పడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు 20 నుంచి 30 నిమిషాల వరకు మీకు ఇష్టమైన పని చేయడం అలవాటు చేసుకోండి. అంటే బుక్స్ చదవడం, పాటలు వినడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి ప్రతి రోజూ చేయండి. ఇలా చేయడం వల్ల నిద్ర త్వరగా వస్తుంది. అలాగే మీ శ్రీవారికి చక్కగా కబుర్లు చెప్పడం, హత్తుకుని పడుకోవడం, లేదా ఒడిలో పడుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది.

5. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పు చాలా జరుగుతుంది . దీని కారణంగా మహిళలకు మరింత వేడిగా, చిరాకుగా ఉంటుంది. ఉక్కపోత అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీ గదిని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కాంతి, శబ్దాలు వంటివి లేకుండా చూసుకోండి. ఈ చిట్కాలతో ప్రెగ్నెన్సీ‌లో కూడా హాయిగా నిద్రపోవచ్చు.