- ప్రతినెలా మహిళలకి ఋతు చక్రం సమస్య సాధారణం.
- అనేక సమస్యల వల్ల ఎక్కువతున్న ఋతు చక్రం సమస్యలు.
- హార్మోన్ అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలు.

Irregular Menstrual Cycle: ప్రతినెలా మహిళలకి ఋతు చక్రం (బహిష్ట) వస్తుందని మనందరికి తెలిసిన విషయమే. మహిళలకు ఋతు చక్రం సమస్యలు ఎందుకు వస్తాయో వివిధ కారణాలు ఉన్నాయి. హార్మోన్ అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఋతు చక్ర సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటో వివరంగా చూద్దాం.
హార్మోన్ల అసమతుల్యత:
మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు బ్యాలెన్స్డ్ గా లేకపోతే నెలసరి చక్రంలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది ముందుగా లేదా ఆలస్యమైన పీరియడ్స్‌కు దారి తీస్తుంది.
అధిక ఒత్తిడి:
మెదడులోని హైపోథాలమస్ అనే భాగం హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. ఎక్కువ ఒత్తిడి పడితే హార్మోన్ స్థాయిలు మారిపోతాయి. దీని ఫలితంగా పీరియడ్స్ ఆలస్యమవుతాయి లేదా పూర్తిగా రాకపోవచ్చు.
ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం:
మహిళా బలహీనత లేదా శరీరానికి తగిన పోషకాలు అందకపోతే హార్మోన్ స్రావం క్రమరహితంగా మారుతుంది. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, విటమిన్ B12, ప్రోటీన్ లోపం వల్ల ఈ సమస్యలు పెరుగుతాయి.
బరువు పెరగడం లేదా తగ్గడం:
అధిక బరువు పెరగడం (ఒబేసిటీ) లేదా హఠాత్తుగా బరువు తగ్గడం కూడా హార్మోన్ అసమతుల్యతకు కారణం అవుతుంది. శరీరంలోని కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి, దీనివల్ల పీరియడ్స్ లో మార్పులు వస్తాయి.
పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS):
PCOS ఉన్న మహిళల్లో అధిక పురుష హార్మోన్ (టెస్టోస్టిరోన్) స్థాయులు ఉంటాయి. ఇది అండాశయాల్లో సిస్టులుగా మారి, పీరియడ్స్‌లో అంతరాయం కలిగిస్తుంది.
థైరాయిడ్ సమస్యలు:
థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువగా పనిచేస్తే, హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అనియమైన ఋతు చక్రం సమస్యలు వస్తాయి.
అధిక వ్యాయామం లేదా శారీరక శ్రమ:
వైవిధ్యమైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్, హఠాత్తుగా శరీరానికి అదనపు ఒత్తిడిని పెంచే వ్యాయామాలు కూడా నెలసరి మార్పులకు కారణమవుతాయి.
మరి వీటి నుంచి ఎలా బయటపడాలంటే.. విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే సరిగ్గా నిద్రపోవడం హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది.
సౌకర్యవంతమైన వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ తీవ్రమైన సమస్యలు ఉంటే, గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.