Leading News Portal in Telugu

How to Keep Children Away from Mobile Phone Addiction?


  • ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువ
  • పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లలు అధికంగా వినియోగం
  • పిల్లలు మొబైల్ వాడటం వల్ల శారీరక అభివృద్ధి మందగింపు.
Mobile Addiction: మీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లతో బిజీగా ఉంటున్నారా..? ఏం చేస్తే పక్కన పెడతారు..!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాల్లో అంతర్భాగమైపోయాయి. పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లలు కూడా మొబైల్‌ ఫోన్లకు బానిసలవుతున్నారు. గతంలో పిల్లలు బడికి వెళ్లి వచ్చిన తర్వాత బయట ఆడుకోవడమో.. ఇంట్లో పుస్తకాలు చదవడమో చేస్తుండే వారు. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం మొబైల్‌ ఫోన్‌లతోనే గడుపుతున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం, చదువు, ఆలోచనా విధానం, శారీరక వ్యాయామం వంటి అన్ని విషయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల వారి శారీరక అభివృద్ధి మందగిస్తుంది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కంటి సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు.. తరచుగా మొబైల్ ఫోన్లలో గేమ్స్‌ ఆడటం వల్ల పిల్లల్లో ఆటిట్యూడ్ మార్పులు, ఒంటరితనానికి అలవాటు పడే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్‌ ఫోన్‌ వ్యసనానికి బానిసలు కాకుండా చూసుకోవాలి. పిల్లలు ఫోన్లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేలా కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి.

పిల్లలను మొబైల్ వ్యసనం నుంచి దూరంగా ఉంచే చిట్కాలు
1. బహిరంగ ఆటలకు ప్రోత్సాహం ఇవ్వండి:
పిల్లలు మొబైల్‌ ఫోన్‌లతో గడిపే సమయాన్ని తగ్గించాలంటే వారిని బహిరంగ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లలు బయటకు వెళ్లి ఆడటం వల్ల శారీరక వ్యాయామం అవుతుంది.. శక్తివంతంగా ఉంటారు. మీరు వారి కోసం స్విమ్మింగ్, సైక్లింగ్, మార్షల్ ఆర్ట్స్‌ వంటి వ్యక్తిగత క్రీడలు లేదా ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్ వంటి బృంద క్రీడలను ప్రోత్సహించండి.

2. పిల్లల దృష్టికి ఫోన్ రాకుండా ఉండండి:
మొబైల్‌ ఫోన్లను పిల్లల దృష్టికి రానివ్వకపోతే వారు వాటిని అంతగా పట్టించుకోరు. నిద్రించే సమయంలో ఫోన్‌ను వారి పడకగదిలో ఉంచకూడదు. అలాగే.. చిన్న వయసులోనే పిల్లలకు వ్యక్తిగత ఫోన్ ఇవ్వకూడదు.

3. స్క్రీన్ సమయాన్ని షెడ్యూల్ చేయండి:
పిల్లలకు మొబైల్ ఫోన్‌లు పూర్తిగా వద్దనడం కుదరదు. కానీ వీలైనంత వరకు పరిమితంగా ఉపయోగించేలా చూడాలి. వారికొక టైమ్ టేబుల్‌ పెట్టి ఆ సమయం మాత్రమే ఫోన్ వాడేలా అలవాటు చేయండి. ఉదాహరణకు.. రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే యూట్యూబ్‌ లేదా గేమ్స్ ఆడేందుకు అనుమతించడం మంచిది.

4. కుటుంబంతో సమయం గడపండి:
పిల్లలు ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లను ఎక్కువగా వాడతారు. వారితో ఇంట్లో సరదాగా గడిపేలా చూసుకుంటే మొబైల్‌ ఫోన్‌పై వారి ఆసక్తి తగ్గుతుంది. అందుకే వారికి కబుర్లు చెప్పండి, పుస్తకాలు చదివించండి, కథలు వినిపించండి.

5. తల్లిదండ్రులు తమ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి:
పిల్లలు తల్లిదండ్రులను చూసే అలవాటు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే మీరు కూడా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్‌ను ఉపయోగించాలి.