
Stay Cool Stay Healthy: వేసవి కాలం రాగానే ఏసీని వినియోగించే ప్రతి ఒక్కరూ వాడకాన్ని మొదలు పెడతారు. ప్రతి ఏడాది గత ఏడాదికంటే అధికంగా ఎండలు ఉన్న నేపథ్యంలో, చల్లదనాన్ని కోరుకునే వారు ఎయిర్ కండిషనర్ వైపు మొగ్గుతున్నారు. అయితే, ఏసీ చల్లదనం ఉపశమనాన్ని అందించినా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. ఏసీ వల్ల ఏర్పడిన చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇది ఎందుకవుతుందంటే, ఏసీలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీని వలన శరీర ఉష్ణోగ్రత తగ్గి, రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. ఫలితంగా అనారోగ్యానికి లోనవుతాము.
మరి అనారోగ్యాన్ని నివారించేందుకు సులభమైన మార్గాలు ఉన్నాయి. మరి అవేంటంటే..
* AC ఉష్ణోగ్రతను సరైన స్థాయిలో ఉంచండి:
ఏసీని ఎప్పుడూ 24°C – 26°C మధ్య ఉష్ణోగ్రతను సెట్ చేయండి. ఎక్కువగా చల్లగా ఉంచితే శరీరానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు.
* ప్రత్యక్షంగా గాలిని పడనీయవద్దు
ఏసీ నుండి వచ్చే గాలి నేరుగా ముఖానికి, శరీరానికి తగలకుండా జాగ్రత్త పడండి. గాలి ప్రవాహాన్ని పైకి లేదా పక్కకు మళ్లించండి. ఇలా చేయడం ద్వారా తలనొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
* AC ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయించండి
ఫిల్టర్లలో దుమ్ము, బ్యాక్టీరియా పేరుకుపోతే ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. ప్రతి 3 నెలలకు ఏసీ క్లీనింగ్ చేయించుకోవడం ఆరోగ్య రీత్యా మంచిది.
* తరచూ గదిని వెంటిలేట్ చేయండి
ఏసీ ఆన్ చేసినప్పుడు గది పూర్తిగా మూసివేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. కనీసం ప్రతీ రెండు గంటలకు 5 నిమిషాలు కిటికీలు లేదా తలుపులు ఓపెన్ చేసి గాలిని మార్చండి.
* శరీరానికి తేమను అందించండి
ఏసీ గాలి వల్ల శరీరం తేమ కోల్పోతుంది. కాబట్టి రోజంతా నీటిని బాగా త్రాగండి. వీలైతే హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి. రాత్రి పూట ఏసీ టైమర్ పెట్టడం కూడా మంచిదే.