Leading News Portal in Telugu

Sperm Count: How Many Sperm Cells Are Needed for Conception


Sperum Count: సంతానం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటే!

Sperum Count: ప్రస్తుత రోజుల్లో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇకపోతే, సంతానం కలగాలంటే సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి.

ఇక ఈ విషయంలో వీర్యకణాల సంఖ్య 10 మిలియన్ నుంచి 20 మిలియన్ వరకు ఉంటే, దాన్ని ‘లో-స్పెర్మ్ కౌంట్’ అంటారు. అయితే, గర్భధారణ కోసం కనీసం 30 మిలియన్ కంటే ఎక్కువ స్పెర్మ్ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ ఇబ్బందులను ఎదుర్కొనే మగవారు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యంగా అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. విటమిన్ D, C, E లను సమృద్ధిగా తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కదలిక, నాణ్యత మెరుగవుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్, ధూమపానం, మాదక ద్రవ్యాలు దూరంగా ఉంచాలి. అలాగే అధిక సైక్లింగ్, సింథటిక్ దుస్తులు ఉపయోగించడం కూడా తగ్గించాలి.

ఇక ఆహారపరంగా చూస్తే.. దానిమ్మ గింజలు, పాలకూర, మిరపకాయలు, టమోటాలు, పుచ్చకాయలు, యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, అరటిపండ్లు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి వీర్యకణాల సంఖ్యను పెంపునకు, నాణ్యత మెరుగుదలకు దోహదం చేస్తాయి. అలాగే మహిళా వయసు 35 ఏళ్లు దాటినట్లయితే వైద్య సలహా తీసుకుని సకాలంలో పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.