
Buffalo Milk vs Cow Milk: పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది పోయింది. మనం పాలు నేరుగా తాగినా లేదా దానితో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను మన ఆహారంలో చేర్చుకున్నా, అది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఆవు పాలు లేదా గేదె పాలు తాగడంలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయా అనే విషయంలో ప్రజల్లో ఇప్పటికి అనేక గందరగోళ ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. మరి ఈ ప్రశ్నకు అసలైన సమాధానం ఒకసారి చూద్దామా..
గేదె పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. చల్లని ప్రదేశాలలో లేదా చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో గేదె పాలు సహాయపడతాయి. బరువు పెరగాలనుకునే వారికి లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి గేదె పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గేదె పాలలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం వంటి అతి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. అలాగే శరీర ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది. శరీరానికి శక్తిని ఎక్కువ కాలం ఉండాలంటే గేదె పాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆవు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాలలో కంటే కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తేలికగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సులభం చేస్తుంది. ఆవు పాలలో అధిక నాణ్యత గల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, శరీర కణజాలాలను నిర్మించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. ఇది పిల్లలకు, వృద్ధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఆవు పాలు తాగడం వల్ల శరీరానికి సమృద్ధిగా శక్తి లభిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే.. గేదె పాలు తక్కువ లాక్టోజ్, ఎక్కువ పోషకాలు, కొంతమేర కొవ్వుతో ఉంటాయి. గేదె పాలలో మరింత ప్రోటీన్, కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బాగా ఉపయోగం ఉంటుంది. కానీ, గేదె పాలు కొవ్వు ఎక్కువగా ఉండటంతో కొంతమందికి ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు. ఆవు పాలు తక్కువ కొవ్వుతో ఉండటంతో మరింత తేలికగా జీర్ణమవుతాయి. కానీ, అందులో పోషకాల పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి, గేదె లేదా ఆవు పాలు ఏది తాగాలని చెప్పడం కష్టం. ఎందుకంటే, ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు వేరే వేరే ఉంటాయి. ఏ పాలు మీకు సరిపోతాయో.. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయించుకోండి. మీకు సరిపోయే పాలపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. అది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.