
Kaju Paneer Masala: ప్రస్తుతం బయటికి వెళ్లి ఏమి తినాలన్న వాటి రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి, ఇంట్లోనే రెస్టారెంట్ లేదా ధాబాలో తయారు చేసే వంటకాలు చిటికెలో మన ఇంట్లోనే తయారు చేసి కుటుంబ సభ్యులతో తినడం చాలా శ్రేయస్కరం కూడా. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ లలో కాలం చెల్లిన పదార్థాలను వాడడం, చెడిపోయిన వాటిని కూడా ఉపయోగించడం లాంటి అనేక ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో దాబా స్టైల్ లో అతి తక్కువ సమయంలో ‘కాజు పన్నీర్ మసాలా’ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి.
కాజూ పన్నీర్ మసాలా ధాబా స్టైల్‌లో రుచిగా తయారుచేయాలంటే ముందుగా.. మనకు అవసరమైన పరిమాణంలో కాజూలను కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకుని ఒక మిడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత అవసరం మేరకు టమాటా ముక్కలను, ఉల్లిపాయలకు జత చేయాలి. అలా టమాటా మెత్త పడేవరకు ఉండాలి. ఆ తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపాలి. అలా వేసిన తర్వాత కొద్దిగా నీటిని కలపాలి. అలా కొద్దిసేపు మిశ్రమం నుంచి నూనె వదిలే వరకు మరిగించాలి. ఆ తరువాత వేయించిన కాజూలను కొద్దిగా నీళ్ళతో కలిపి గ్రైండ్ చేసి క్రీమ్‌లా చేసుకొని, దానిని మసాలాలో కలపాలి.
ఇక చివరగా ముక్కలుగా కట్ చేసిన పన్నీర్ ముక్కలను జతచేసి మెల్లగా కలపాలి. ఈ పన్నీర్ ముక్కలు కాస్త తస్సాతి గా ఉండాలనుంటే నేరుగా అందులో వేయకుండా ముందుగా కాస్త నూనెలో దోరగా వేయించుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఆలా పన్నీర్ కలిపాకా అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి మసాలా కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. చివరగా ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసి, కొద్దిగా కొత్తిమీర చల్లి గార్నిష్ చేయాలి. ఇంకేముంది ధాబా స్టైల్ ‘కాజు పన్నీర్ మసాలా’ రెసిపీ తయారైంది. ఇలా వేడిగా ఉండగానే చపాతీ, నాన్ లేదా రైస్‌తో సర్వ్ చేసుకుంటే రుచికరమైన ధాబా స్టైల్ కాజూ పన్నీర్ మసాలాను ఆస్వాదించవచ్చు.