
Sperm Count: పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో వీర్యకణాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఆరోగ్యవంతమైన పురుషుల్లో ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుండి 300 మిలియన్ల స్పెర్మ్‌లు ఉంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో వీర్యకణాల నాణ్యత, వాటి కదలికలు తగ్గిపోతున్నాయని అనేక పరిశోధనలలో తేలాయి. దీని వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువతున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణాలుగా పలు సమస్యలను వైద్యులు వ్యక్తపరుస్తున్నారు. మరి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దామా..
పునరుత్పత్తి సామర్థ్యం.. వ్యక్తి వయస్సు ప్రభావం చూపుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. మానసిక సమస్యలు, ఆటిజం వంటి ఆరోగ్య సమస్యలు వయసు మీదపడిన తండ్రుల పిల్లల్లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే తాగుడు, ధూమపానం, డ్రగ్స్ వంటి అలవాట్లు వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని కాడ్మియం స్థాయిని పెంచి స్పెర్మ్ DNAను దెబ్బతీయడం ద్వారా నాణ్యతను ప్రభావితం చేస్తాయి. మత్తు పదార్థాలు సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని, రక్త సరఫరాను కూడా తగ్గిస్తాయి.
మానసిక ఒత్తిడితో హార్మోన్లు కాస్త అటుఇటుగా మార్పులు చేసుకుంటాయి. ఇది వీర్యకణాల ఉత్పత్తిని, నాణ్యతను ప్రభావితం చేస్తుంది. బాడీ బిల్డింగ్‌లో ఉపయోగించే అనాబాలిక్ స్టెరాయిడ్‌లు కూడా వృషణాల పరిమాణాన్ని తగ్గించి స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. ఇక ముఖ్యంగా వీర్యకణాలు అధిక ఉష్ణోగ్రతను సహించలేవు. వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2-4 డిగ్రీలు చల్లగా ఉండాలి. అధిక వేడి వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సీటింగ్ హీటర్లు, హాట్ వాటర్ బాత్‌లు వంటి వాటి వల్ల వీర్యకణాల ఉత్పత్తిలో తేడాలు జరగవచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు నుంచి వచ్చే రేడియేషన్ వీర్యకణాల ఆకారాన్ని, చలనం, శక్తిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులో పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఇది మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.