
Pregnancy Tips: ప్రస్తుతం చాలా మంది దంపతులు పిల్లలు లేక అనేకమంది ఇబ్బంది బాధపడుతున్నారు. ఈ ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్య ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో 10 నుంచి 15 శాతం వరకూ ఉందని తేల్చింది. అయితే ఈ సంతానలేమి సమస్యలకి మహిళల సమస్యలే ప్రధాన కారణంగా ఎక్కువగా భావిస్తున్న, పురుషుల్లోనూ ఈ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటో ఒకసారి చూద్దామా..
ఇందులో మొదటగా వయస్సు ప్రభావం గురించి మాట్లాడుకోవాలి. వయస్సు పెరిగిన కొద్దీ మహిళల్లో గర్భధారణ సామర్థ్యం తగ్గుతుంది. వారు పుట్టినప్పటి నుంచే పరిమిత సంఖ్యలో గుడ్లు (ఎగ్స్) కలిగి ఉంటారు. ఇది 35 ఏళ్ల తర్వాత వేగంగా తగ్గుతుంది. పురుషులలోనూ ఆ వయస్సులో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఇది సంతానలేమికి దారితీస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో పీసీఓఎస్ (PCOS) అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యగా మారింది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. గర్భసంచిలో చిన్న చిన్న సిస్టులు ఏర్పడి, అండం విడుదలలో ఆటంకం కలుగుతుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది.
అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలం బయట పెరుగడాన్ని సూచిస్తుంది. ఇది పొత్తికడుపు, అండాశయాలు, అండనాళాలు మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి వల్ల అండం క్వాలిటీ తగ్గి, గర్భధారణలో సమస్యలు తలెత్తుతాయి. ఇక ముఖ్యంగా స్త్రీలు, పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఒవ్యూలేషన్ సమస్యలు, నెలసరి క్రమం తప్పడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. పురుషుల్లో ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి, అంగస్తంభన లోపం, లైంగిక ఉత్సాహం తగ్గడం వంటి ప్రభావాలు చూపుతుంది.
ఇక నేటి కాలంలో జీవనశైలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం, అధిక బరువు వంటి అనారోగ్యకర జీవనశైలీ కారకాలు సంతానలేమికి దారితీస్తాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. పురుషులు, మహిళల పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే పురుషుల్లో కనిపించే ‘వరికోసెల్’ సమస్య వృషణాల వద్ద ఉన్న రక్తనాళాల వాపుతో ఏర్పడుతుంది. ఇది వృషణాల ఉష్ణోగ్రతను పెంచి వీర్యకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గి, నాణ్యతలో లోపాలు వస్తాయి. అలాగే శస్త్రచికిత్సలు, గాయాల వాళ్ళ ఏర్పడే ఇన్‌ఫెక్షన్లు, శస్త్రచికిత్సలు, గాయాల వల్ల పునరుత్పత్తి అవయవాలు నష్టపోతే సంతానోత్పత్తి సామర్థ్యం పడిపోయే ప్రమాదం ఉంది. పురుషుల్లో వృషణాలు, ప్రోస్టేట్ సమస్యలు స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటి నుంచి వీలైనంతవరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి.