- రోజుకు 12 గంటల పాటు పబ్‌జీ గేమింగ్..
- 19 ఏళ్ల యువకుడికి పాక్షిక పక్షవాతం..
- వెన్నెముకపై తీవ్ర ప్రభావం..

Gaming addiction: మొబైల్, ట్యాబ్‌లలో ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిసలుగా మారుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ యువత ఈ పబ్‌జీ వంటి గేమ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇలా, గేమింగ్ వ్యసనం వల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో, ఢిల్లీలోని 19 ఏళ్ల యువకుడి ఘటన చూస్తే అందరికి అర్థమవుతుంది. రోజులో 12 గంటల పాటు పబ్‌జీ గేమ్ ఆడుతూ, గేమింగ్‌కి వ్యసనంలో మునగడం వల్ల ఒక సదరు టీనేజర్ ‘‘పాక్షిక పక్షవాతానికి’’ గురయ్యాడు. చివరకు వెన్నెముకకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
12 గంటల పాటు అదే పనిగా గేమ్ ఆడటం వల్ల అతడి వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడింది. చివరకు అతను తన ‘‘మూత్రాశయం’పై నియంత్రణ కోల్పోయాడు. వెన్నెముక ఒత్తిడితో ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి నిర్ధారణ కాని వెన్నెముక క్షయవ్యాధి (టీబీ) పరిస్థితిని మరింత దిగజార్చింది. అతను ఆస్పత్రిలో చేరే సమయానికి నడిచే పరిస్థితుల్లో కూడా లేడు.
ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ISIC) వైద్యులు అతని వెన్నెముకలో తీవ్రమైన వైకల్యాన్ని గుర్తించారు. దీనిని ‘‘కైఫో-స్కోలియోసిస్’’ అని పిలిచే ప్రమాదకర పరిస్థితిగా గుర్తించారు. ఇది వెన్నెముక ముందుకు, పక్కు వంగడాన్ని కలిగి ఉంటుంది. స్కాన్ చేయడం ద్వారా క్షయవ్యాధి అతడి వెన్నెముకోని ఎముకలకు (D11 మరియు D12) సోకిందని, దీని ఫలితంగా చీము ఏర్పడి అతని వెన్నుపాముపై ఒత్తిడి ఏర్పడిందని తేలింది. ముందస్తుగా టీబీ, అదే పనిగా గేమింగ్ వ్యసనం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు ISICలోని స్పైన్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ వికాస్ టాండన్ అన్నారు.
దీనిని నయం చేయడానికి వైద్యులు ‘‘స్పైనల్ నావిగేషన్’’ అనే టెక్నాలజీని వాడారు. దీని వల్ల వెన్నెముకలో స్క్రూలు అమర్చి, వెన్నెముకను అత్యంత ఖచ్చితత్వంతో సరిచేస్తారు. మన కారులో జీపీఎస్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. ఈ శస్త్ర చికిత్స తర్వాత కొన్ని రోజుల్లోనే యువకుడు కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తిరిగి మూత్రాశయంపై నియంత్రణ సాధించడంతో పాటు నడవడం ప్రారంభించాడని, వెన్నుపాముప ఒత్తిడి తగ్గిందని చెప్పారు. సుదీర్ఘంగా ఫోన్‌లు వాడటం, ఒకే భంగిమలో కదలిక లేకుండా శరీరాన్ని గంటల పాటు అలాగే ఉంచడం వల్ల ఎముకలు, కీళ్లలో సమస్యలు ఏర్పడుతాయని వైద్యులు చెప్పారు.