
ప్రేమలో పడితే సంతోషమే సంతోషం. చాటింగులు, డేటింగులు, ముద్దులు, ముచ్చట్లు, సినిమాలు, షికార్లు ఇలా ప్రేమికులకు లోకమంది ఇంద్రధనుస్సులో కనిపిస్తుంది. ప్రేమలో ఎంత సంతోషంగా ఉంటారో.. బ్రేకప్ అయితే మనస్సు ముక్కలై కుమిలిపోతారు. అంతకుముందు ఇంటిపటున ఉండకుండా తిరిగేవారు. బ్రేకప్ తర్వాత ఇంటినుంచి బయటకు రాకుండా జీవితమే కోల్పోయినట్లుగా కుమిలిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. జీవితం ముక్కలైపోయిందని కృంగిపోతారు. ప్రేమ అనేది జీవితంలో భాగమే తప్ప ప్రేమే జీవితం ప్రేమికులు దూరం అయితే ఇక జీవితమే లేదని అనుకోకూడదు. బ్రేకప్ వల్ల చాలా ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
బాధలోనే స్ట్రాంగ్..
బ్రేకప్ అయినప్పుడు బాధగా ఉంటుంది. ఆ బాధలోనే ఉంటాం. కానీ, కొన్ని రోజులకి మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం. ఏడ్చిన తర్వాత మనసు తేలిక అవుతుంది. కాబట్టి, హ్యాపీగా నవ్వుతాం. ఎలాంటి ఇబ్బందులు పడం. ఎన్ని ఆటంకాలు వచ్చిన తట్టుకోగలుగుతాం. ఎవ్వరినీ అంత సులువుగా నమ్మం. ఇంకో భాగస్వామిని ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం.
ఏదైనా సాధించగలరు..
విడిపోయిన తర్వాత చాలా మంది సెల్ఫ్ లవ్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నమ్మడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఓ రకంగా చెప్పాలంటే ఆ టైమ్‌లో ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. అలాంటి టైమ్‌లోనే వారిపై వారికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందంగా ఉండాలనుకుంటారు. అన్ని విషయాలపై ఫోకస్ పెడతారు. ఈ టైమ్‌లో ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఇప్పటికీ సమాజంలో మంచి పేరు, ఖ్యాతి, అనుకున్న రంగంలో విజయం సాధించిన వ్యక్తులు ఒకప్పుడు బ్రేకప్ బారిన పడ్డవాళ్లే!
స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతారు..
బ్రేకప్ అయ్యాక.. ఒకరి అనుమతి అవసరం లేదు. ఏ బట్టలు వేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అంతకు మించి లేదు. ఇష్టంగా ఉండొచ్చు. మనదే స్వాతంత్ర్యం అన్నట్లుగా ఉంటుంది. ఏ విషయం గురించైనా మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు సాటిస్‌ఫాక్షన్‌ని ఇస్తుంది. నీ రాజ్యానికి నువ్వే హీరో అన్నట్లుగా ఉంటుంది. నిన్ను నియంత్రించే వాళ్లు లేకపోవడంతో స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతావు.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి సమయం ఇవ్వడం..
ఒకరితో రిలేషన్‌లో ఉంటే ఎంతసేపు వారితోనే సమయం గడుస్తుంది. గంటల పాటు వాళ్లతోనే ముచ్చట్లు పెడుతూ ఉంటారు. వేరేవారి ఊసే రాదు. కానీ, రిలేషన్ బ్రేకప్ అయినప్పుడు మాత్రం మనకి చాలా టైమ్ ఉంటుంది. దీంతో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాలా వరకూ టైమ్ స్పెండ్ చేస్తాం. క్వాలిటీ టైమ్ గడుపుతాం. వారి విలువేంటో తెలుస్తుందనే చెప్పొచ్చు. అంతే కాకుండా.. మనకి టైమ్ ఎక్కువగా ఉండడం వల్ల కొత్త విషయాలను నేర్చుకునేందుకు ట్రై చేస్తాం. అందుకు అన్ని మార్గాలను వెతుకుతాం. మనలోని టాలెంట్‌ని బయటికి కూడా తీసుకొస్తాం. కాబట్టి, బ్రేకప్ అయిందని బాధలో మునిగిపోయే బదులు హ్యాపీగా ఈ బెనిఫిట్స్‌ని కూడా ఎంజాయ్ చేయండి.