Leading News Portal in Telugu

Ice cream harmful to our health


  • ఐస్ క్రీం మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది
  • ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే పదార్థాలు, కల్తీ కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
Health Tips: ఐస్ క్రీం తింటున్నారా?.. ఈ ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే!

ఐస్ క్రీం అన్ని సీజన్లలో లభిస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఐస్ క్రీం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేసవిలో చల్లని ఐస్ క్రీంని ఆస్వాధిస్తుంటారు. కానీ మనం ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీం మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఐస్ క్రీం తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే పదార్థాలు, కల్తీ కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

బరువు పెరిగే అవకాశం

ఐస్ క్రీంలో అధిక చక్కెర, క్రీమ్ ఉంటాయి. మీరు దీన్ని ప్రతిరోజూ లేదా ఎక్కువ పరిమాణంలో తింటే బరువు పెరగడానికి దారితీస్తుందంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది.

దంతాలు క్షీణిస్తాయి

ఐస్ క్రీంలో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది మీ దంతాలకు హాని కలిగిస్తుంది. దీనివల్ల దంతక్షయం, నొప్పి వస్తుంది. ఐస్ క్రీం తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోకపోతే, మీ దంతాలు మరింత త్వరగా పాడవుతాయి.

జీర్ణక్రియలో ఇబ్బంది

చాలా మందికి పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఐస్ క్రీం కూడా పాలతో తయారవుతుంది. కాబట్టి కొంతమందికి దీనిని తిన్న తర్వాత గ్యాస్, నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

మొటిమల సమస్య

ఐస్ క్రీంలో అధిక కొవ్వు, చక్కెర ఉంటాయి. ఇవి మన శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రభావం ముఖం మీద కనిపిస్తుంది. మొటిమలు, చర్మ సంబంధిత ఎలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

రక్తంలో చక్కెర పెరిగే ఛాన్స్

ఐస్ క్రీంలో అధిక చక్కెర కారణంగా డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి ఐస్ క్రీం అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడానికి కారణమవుతుంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది.