
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలో సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. యవ్వనంగా కనిపించాలంటే, అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే, మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే పార్లర్‌కు వెళ్లే పని లేకుండా సహజంగా అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలు ఆహారంలో భాగం తీసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగానే కాదు, సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!
1. కొంతమందికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు. అలాంటివారు క్రమం తప్పకుండా సబ్జా గింజలు ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
2. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సబ్జా గింజల్లో ఉండే విటమిన్ ఇ సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని, ఈ గింజల వల్ల చర్మానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుందని చెబుతున్నారు.
3. మహిళలు 30 ఏళ్ళు రాగానే ఎదుర్కొనే సమస్యల్లో, చర్మం ముడతలు పడడం మొదటి సమస్య. దీని వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. దీంతో చాలా మంది యాంటీ ఏజింగ్ క్రీమ్‌లను వాడుతుంటారు. కానీ ఈ సమస్యకు మేలైన పరిష్కారం సబ్జా గింజల్లోని పోషకాలు. ఇక ఈ గింజలతో తయారు చేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల త్వరగా రిజల్ట్ కూడా ఉంటుంది.
4. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్‌తో నిండిన సబ్జా గింజలు ఆకలిని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సాయపడతాయి. అలాగే సబ్జా గింజల్లో ఉండే యాంటి బయోటిక్, యాంటి ఫంగల్, యాంటి మైక్రోబియల్ లక్షణాలు.. చర్మ స్థితిస్థాపక లక్షణాలు చర్మం త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.
5. చర్మానికే కాదు.. జుట్టుకు సబ్జా గింజలు మంచి పోషణ అందిస్తాయి. వీటిలో అధికంగా లభించే విటమిన్ కె, బీటా కెరోటిన్, ఇతర ప్రొటీన్లు.. జుట్టు, కుదుళ్లు దృఢంగా ఉండేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అయితే సబ్జా గింజలు సహజసిద్ధమైనవే అయినా కొంతమంది పడకపోవచ్చు. కాబట్టి వాటిని వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.