- వేసవి సెలవులు ముగిశాయి
- పాఠశాలలు తెరుచుకున్నాయి
- మీ పిల్లల్లో ఈ అలవాట్లు ఉంటే..
- వెంటనే మానిపించండి

వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక ఎప్పటిలాగానే బడి గంటలు మోగుతున్నాయి. సెలవుల్లో హాయి గా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్తున్నారు. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా ఏడాదికి సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే.. పాఠశాలకు వెళ్తున్న మీ పిల్లలకు బ్యాగులు, పుస్తకాల వంటి సామగ్రితో పాటు కొన్ని అంశాలపై అవగాహన కొన్నింటికి దూరం చేయడం చాలా ముఖ్యం అవేంటో ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలకు దూరం చేయండి..
సోషల్ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. అది ఎంతలా అంటే రోజులో ఓ గంటసేపైనా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి మాధ్యమాలకు దూరంగా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. దీంతో చదువు పక్కదారి పడుతోంది. క్రమంగా కొంతమందిలో మానసిక సమస్యలకు దారి తీస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దానికి తగ్గట్టే చాలామంది తల్లిదండ్రులు ‘మా పాప రోజూ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటుంది.. దాంతో చదువులో వెనకబడిపోయింది’, ‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా ఇన్‌స్టాగ్రామ్ ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నాడు. ఆ మాయలో పడి రాత్రి సరిగ్గా తినట్లేదు.. నిద్ర కూడా పోవడం లేదు’ అంటూ వాపోతున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే వారిని వీలైన త్వరగా మార్చండి.. లేదంటే చాలా ప్రమాదం..
ఫోన్స్ ఇవ్వొద్దు..
పిల్లలకు ఫోన్‌కు దూరంగా ఉంచాలని నిపుణలు సూచిస్తున్నారు. పిల్లల్లో కనిపించే సమస్యలు ఐదేళ్లలోపే గుర్తిస్తే త్వరగా నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫోన్లకు అలవాటైన పిల్లల్లో భాషా నైపుణ్యాలు పెరగవని అంటున్నారు. ఇలాంటి వారుకు తమకు కావాల్సింది దక్కకపోతే కొట్టడం, తలబాదుకోవడం, వస్తువులు విసిరేయడం వంటివి చేస్తుంటారని తెలిపారు. ఫోన్ ఇవ్వడాన్ని తగ్గించి అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఆటలు ఆడించాలి..
పిల్లల్ని ఆటల గురించి అడిగితే.. ఆన్‌లైన్‌లో ఏమేమి గేమ్ యాప్స్ ఉన్నాయో.. అందులో వచ్చే గేమ్స్ లిస్టు ఏకరువు పెట్టేస్తారు. తరగతిలో చెప్పిన పాఠం కూడా అంత వివరంగా చెప్పరు. అంతలా పిల్లలు ఆటల పట్ల ఆసక్తితో ఉంటారు. అది వాళ్ల తప్పు కాదు. పరిస్థితులలా ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ గేమ్స్ వల్ల కళ్లు, మెడ నరాలు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయనేది నిపుణులు చెప్తున్న మాట. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు వీటి పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాటలు లేని బాల్యం పరిపూర్ణమైంది కాదు. స్నేహాలు, మానసిక వికాసాలు ఆటల్లోనే ప్రధానంగా జరిగేది. శారీరక వ్యాయామం కలిగేది ఆరుబయట ఆడే ఆటల్లోనే. పిల్లలు ఆటలు ఆడటంతోనే గెలుపు ఓటములు అంగీకరించే తత్వం అలవడుతుంది. అందుకే రోజూ ఆటలు ఆడించాలి.
పుస్తకాలు చదివించండి..
ఏ వయసులో అయినా పుస్తకాలు చదవడం మంచి అలవాటు. అయితే విజ్ఞానాన్ని పెంచే బుక్స్ పిల్లలకు బెస్ట్ ఆప్షన్. చిన్నారులు కేవలం అకడమిక్స్‌పైనే దృష్టి పెట్టకుండా, వారితో ఆలోచనా సామర్థ్యం, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచే పుస్తకాలను తల్లిదండ్రులు చదివించాలి. తర్వాత వాటిలోని విషయాలను పిల్లలతో చర్చించాలి. ఇందుకు స్ట్రాంగ్ రీడింగ్ హ్యాబిట్ వారికి అలవాటు చేయాలి.
త్వరగా నిద్ర పోయేలా చర్యలు..
పిల్లలు త్వరగా నిద్రపోయేలా చూడాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం అస్సలు మంచిది కాదు. పూర్వం అయితే రాత్రి 6 లేదా 7 గంటలకే నిద్ర పోయేవారు. ఆ తర్వాత కాలంలో 8 లేదా 9 గంటలకు నిద్రపోయి.. తెల్లవారు జామున 4, 5 గంటలకు మేల్కొనేవారు. కానీ ఇప్పుడు అర్ధరాత్రులు దాటిన తర్వాత పడుకుంటున్నారు. మళ్లీ ఉదయాన్నే పాఠశాల సమయానికి లేవడంతో వారికి నిద్ర సరిపోదు. దీంతో ఏ అంశంపై కూడా ఏకాగ్రత పెట్టలేరు. కొత్త విషయాలు నేర్చుకోలేరు. ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. సెలవుల్లో మీ పిల్లలు ఫోన్ వల్లనో, ఇతర విషయాల వల్ల లేట్‌గా నిద్రపోయి ఉంటే.. ఇప్పుడు దాన్నే కొనసాగించవద్దు. త్వరగా పడుకుని త్వరగా లేచేలా చర్యలు తీసుకోండి.