
తెలుగువారి భోజనంలో నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని వాసన, రుచి ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ నేటి ఆరోగ్యవంతమైన జీవనశైలి లో, నెయ్యిని కొలెస్ట్రాల్ పెంచే పదార్థం గా భావిస్తూ దానికి చాలామంది దూరంగా ఉంటున్నారు . నెయ్యి నిజంగా హానికరమేన? డాక్టర్‌లు ఏం అంటున్నారు అంటే.. శుద్ధ నెయ్యి మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. పాత కాలంలో పశుపాలన ఆధారంగా తయారు చేసిన నెయ్యి వల్ల – జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యం బాగా మెరుగవుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.
1970ల నాటి పాశ్చాత్య పరిశోధనల ప్రకారం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారి వద్ద గుండెపోటు కేసులు ఎక్కువగా రావడం గమనించారు. దీనికి ఆధారంగా నెయ్యి, వెన్న వంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించబడ్డాయి. కానీ ఈ విషయం బయోకెమికల్ కాంప్లెక్సిటీ పై ఆధారపడి ఉంది, ఇది పూర్తిగా నిర్ధారితమైందని అనలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది కల్తీ పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని వినియోగిస్తున్నారు. ఇది గట్టి రుచికి సరిపోయిన, పోషక విలువలు తగ్గిపోతాయి. అలాగే, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కలిపే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
నెయ్యి ప్రయోజనాలు :
గుడ్ ఫ్యాట్ – మోనోసాచురేటెడ్ ఫ్యాట్లు
నెయ్యిలో “గుడ్ ఫ్యాట్స్” అనబడే మోనోసాచురేటెడ్ మరియు షార్ట్-చైన్ ఫ్యాటీ ఆసిడ్లు ఉన్నాయి. ఇవి హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేసేందుకు సహాయపడతాయి. అధిక రిఫైన్డ్ ఆయిల్స్ వాడకానికి బదులుగా నెయ్యిని ఉపయోగించడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావించబడుతుంది.
జీర్ణ వ్యవస్థకు మేలు
నెయ్యి లోని బుటైరిక్ ఆసిడ్ (Butyric acid) పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. నెయ్యిని వేడి అన్నంలో కలిపి తినటం జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా, ఆహారంలో పోషకాలను శరీరం మెరుగ్గా శోషించుకునేలా చేస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరచడం
నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మానసిక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తల్లి పాలలో ఉన్న కొవ్వుల మాదిరిగానే, నెయ్యిలో ఉండే కొన్ని కొవ్వులు మెదడు అభివృద్ధికి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది నాడీవ్యవస్థను బలపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
అయితే కొలెస్ట్రాల్ విషయంలో..?
నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, అది సరైన జీవనశైలి ఉన్నవారికి హానికరంగా మారదని నిపుణుల అభిప్రాయం. నిత్యం వ్యాయామం, నియమితంగా ఆహారం తీసుకునే వారైతే, నెయ్యిని మితంగా తీసుకోవచ్చు. అయితే మధుమేహం, గుండె సంబంధిత రోగాలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే నెయ్యిని ఆహారంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక చివరగా .. నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో అన్నది దాని స్వచ్ఛత, మోతాదు పై ఆధారపడి ఉంటుంది. శుద్ధమైన, ఇంట్లో తయారుచేసిన నెయ్యిని మితంగా తీసుకుంటే అది మంచి కొవ్వు గా పనిచేస్తుంది. కానీ మార్కెట్ కల్తీ నెయ్యి ని అధికంగా వినియోగించడం మాత్రం ఆరోగ్యానికి ముప్పే.