Leading News Portal in Telugu

Revolver Prabal: మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా సరికొత్త రివాల్వర్


భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ ‘ప్రబల్’ ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. గతంలో తయారుచేసిన రివాల్వర్ కంటే ఈ ప్రబల్ రివాల్వర్ రేంజ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏడబ్ల్యూఈఐఎల్ తెలిపింది. ఈ రివాల్వర్ 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురిపెడుతుంది.

ఈ ప్రబల్ రివాల్వర్ తక్కువ బరువు కలిగి ఉంటుంది. ప్రబల్ రివాల్వర్ భారతదేశంలో సైడ్ స్వింగ్ సిలిండర్‌తో తయారు చేయబడింది. దేశంలో తయారైన రివాల్వర్‌లలో తమ ఫైర్‌పవర్ అత్యుత్తమమని కంపెనీ పేర్కొంది. ఈ ప్రబల్ రివాల్వర్ 76 మి.మీ బ్యారెల్ తో 700 గ్రాముల బరువు ఉంటుంది. మరోవైపు ప్రబల్ ట్రిగ్గర్ లాగడం చాలా సులభం. మహిళలు తమ స్వీయ భద్రత కోసం సులభంగా తమతో తీసుకెళ్లవచ్చు.

ప్రబల్ రివాల్వర్ బుకింగ్‌లు ఆగస్టు 18 నుండి ప్రారంభంకానున్నాయి. లైసెన్స్ కలిగి ఉన్న సామాన్యులు సైతం ఈ ప్రబల్ రివాల్వర్ ను కొనుగోలు చేయవచ్చని ఏడబ్ల్యూఈఐఎల్ డైరెక్టర్ ఏకే మౌర్య తెలిపారు. AWEIL అనేది కాన్పూర్‌లోని అర్మాపూర్‌లో రక్షణ ఉత్పత్తులను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఇక్కడే భారత సాయుధ దళాలు, విదేశీ సైన్యాలు, దేశీయ పౌర అవసరాల కోసం ఆయుధాలు మరియు తుపాకులను తయారు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే సంస్థ రూ. 6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది. వీటిలో భారత సైన్యం కోసం 300 సారంగ్ ఫిరంగుల తయారీతో పాటు, యూరోపియన్ దేశాలకు సంబంధించి రూ. 450 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీ ఆర్డర్లు ఉన్నాయి.