Leading News Portal in Telugu

Muslim Boy Thrashed: హిందూ అమ్మాయితో ఉన్నాడని ముస్లిం యువకుడిపై దాడి.. వీడియో వైరల్


Muslim Boy Thrashed: కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం పన్నుతున్న వ్యూహాలకు సాధారణ జనాలు బలి అవుతున్నారు. హిందు, ముస్లిం భాయ్ భాయ్ అంటూ కలిసి ఉండాల్సిన వాళ్లు.. పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి.. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని, వారిపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ రౌడీ మూక కూడా ఒక ముస్లిం అబ్బాయికి దాడి చేసింది. ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ విచక్షణా రహితంగా దాడి చేసిన ఈ ఘటన ముంబయిలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ముస్లిం బాలుడిని కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఓ పోలీసు అధికారి అక్కడే ఉన్నా ఆ గొడవలో జోక్యం చేసుకోకపోవడం గమనార్హం.

అసలేం జరిగిందంటే.. ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయితో పాటు వస్తున్నాడు. హిందూ మైనర్‌ అమ్మాయితో ముస్లిం అబ్బాయి ఉన్నాడని రెచ్చిపోయిన కొందరు రౌడీలు అతనిపై దాడికి పాల్పడ్డారు. బాంద్రా స్టేషన్‌లో దాదాపు 8 నుంచి 10 మంది వ్యక్తులు జై శ్రీ రామ్, వందేమాతరం నినాదాలు చేస్తూ ముస్లిం బాలుడిని కొట్టడం ప్రారంభించారు. ఈ సంఘటన జూలై 21న జరిగినట్లు సమాచారం. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా, ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. అరెస్టులు కూడా చేయలేదు. వైరల్ అవుతున్న వీడియోపై ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ స్పందిస్తూ.. ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టం ఉందని, అయితే ఒకరిని అలా కొట్టే హక్కు ఎవరికిచ్చారని అన్నారు.

ఇంతలో, నిర్మల్ నగర్‌కు చెందిన ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. వైరల్ వీడియోను తాము గుర్తించామని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.