Leading News Portal in Telugu

3D-Printed Post Office: దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీసు.. పురోగతికి నిదర్శనమన్న ప్రధాని


3D-Printed Post Office: కర్ణాటకలో బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీస్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ నేడు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు.

1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మద్రాస్‌ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఎల్‌ & టీ సంస్థ దీన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు.

బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లోని భారతదేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కొనియాడారు, ఇది దేశంలోని ఆవిష్కరణలు, పురోగతికి నిదర్శనమని, స్వావలంబన స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ప్రధాని అన్నారు. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.