Leading News Portal in Telugu

Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్‌ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన


Rahul Gandhi: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా.. అమేథీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం దిశగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని దాదాపు 55,000 ఓట్ల తేడాతో ఓడించారు.

అమేథీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు గాంధీ కుటుంబం జేబులో ఉండేది. రాహుల్ గాంధీ 2004 నుంచి అక్కడి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ రాహుల్‌ కోసం సీటును ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కృషి చేస్తారని అజయ్ రాయ్ సూచించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా, ప్రధాని మోడీని సవాలు చేస్తూ ప్రియాంక గాంధీ వారణాసి నుండి పోటీ చేయవచ్చని ఊహించబడింది. అయితే కాంగ్రెస్ చివరి క్షణంలో అజయ్ రాయ్‌ను ఆ సీటు నుంచి పోటీకి దింపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ వారణాసి నుంచి పోటీ చేసి నరేంద్ర మోదీ చేతిలో ఓడిపోయారు.

మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువునష్టం కేసులో తన పదవిని కోల్పోయిన రాహుల్‌ గాంధీ.. ఇటీవల సుప్రీం తీర్పుతో మళ్లీ ఎంపీగా తన పదవిని దక్కించుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలోనూ రాహుల్‌ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా.. మరో సారి భారత్ జోడో యాత్ర చేపట్టి దేశ ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.