WHO Chief: భారతదేశంలో అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం చాలా బాగుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డా.టెడ్రోస్ ఘెబ్రేయేసుస్ ప్రశంసించారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది వైద్య సేవలను పొందతున్నారని అన్నారు. వైద్య రంగంలో డిజిటల్ సేవలు విప్లవాత్మకంగా ఉన్నాయన్నారు.
గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ సదస్సును నిర్వహిస్తున్నందుకు భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. తానొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లానని.. అక్కడ ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసంగా వెయ్యి ఇళ్ల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయానని టెడ్రోస్ తెలిపారు. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని.. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని అన్నారు. జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.
Read also: Indian Railways: వాణిజ్య అవసరాలకు భూమిని లీజుకు ఇవ్వనున్న రైల్వే.. 7,500 కోట్లు సమీకరించే ప్లాన్
సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మండవీయా మాట్లాడుతూ సుమారు 70 దేశాల నుండి ఈ సమావేశాలకు ఆరోగ్యశాఖ మంత్రులు మరియు ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో తాము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోడీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో కేంద్ర మంత్రి సదస్సులో స్పష్టంచేశారు. ఈ నెల 17న మొదలైన సమావేశాలు శుక్రవారం వరకు విజయవంతంగా జరిగాయి. సదస్సులో ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని.. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితులకు తగట్టుగా స్పందించి సిద్దపడటంతోపాటు .. సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు కేంద్ర మంత్రి మాండవీయా తెలిపారు.