దేశ వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్లకు కన్నీళ్లు తెప్పించేందుకు ఉల్లిపాయ సిద్ధమైంది. ఉల్లి ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో ఫలితంగా బహిరంగ మార్కెట్లో చాలినంత ఉల్లి అందుబాటులో ఉండట్లేదు. అంతేకాకుండా ఉల్లి రేట్లు క్రమంగా పెరుగుతోన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి 50 నుంచి 60 రూపాయలు ఉండగా.. మున్ముందు ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. ఈ నిబంధన డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉల్లి ధరలు సెప్టెంబరులో పెరిగే అవకాశముందనే నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఉల్లిగడ్డలు దేశీయంగా అందుబాటులో ఉంచడం కోసమే ఈ సుంకం విధించామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే దేశీయంగా ఉల్లిగడ్డ లభ్యతను పెంచడం కోసం బఫర్ స్టాక్ నుంచి మూడు లక్షల టన్నులను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం.. ఇప్పటివరకైతే స్టాక్‌ను రిలీజ్ చేయలేదు.