Leading News Portal in Telugu

Arvind Kejriwal: ఛత్తీస్‌గఢ్‌కు అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం


Arvind Kejriwal: ఛత్తీస్‌గఢ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్‌ వరాల జల్లు కురిపించింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఆప్ హామీలు కురిపించింది. మహిళలకు నెలవారీ `సమ్మాన్ రాశి’, నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి సహా పది హామీలు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఢిల్లీ, పంజాబ్‌లలో తమ పార్టీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాయని, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే అదే పని చేస్తామని చెప్పారు.

ఆప్ హామీలివే..

*10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు

*24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా

*ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచితం

*నవంబర్ 2023 వరకు పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీ

*18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ రూ.1,000 ‘సమ్మన్ రాశి’ (గౌరవ వేతనం)

*పిల్లలందరికి ఉచిత విద్య

*ఢిల్లీ తరహాలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి పౌరునికి ఉచిత, మెరుగైన ఆరోగ్య చికిత్స

*ప్రతి గ్రామం, నగరాల్లోని వార్డులలో మొహల్లా క్లినిక్‌లు

*నిరుద్యోగులకు రూ.3,000 నెలవారీ భృతి

*సీనియర్ సిటిజన్‌లకు ఉచిత తీర్థయాత్ర,

*విధి నిర్వహణలో అమరులైన రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్ల (ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు) కుటుంబాలకు రూ. కోటి అందజేత

*కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్

తదుపరి హామీలు రైతులకు, గిరిజనులకు సంబంధించినదేనని అయితే తదుపరి పర్యటనలో వెల్లడిస్తానని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నారు.అరవింద్ కేజ్రీవాల్ గత నెలలో బిలాస్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన ఆప్ కార్యకర్తల సదస్సుకు ఆయన హాజరయ్యారు. 2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 90 స్థానాలకు 85 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, కానీ విజయం సాధించలేకపోయింది.